టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.13వ తేదీన కేసు ఎందుకు పెట్టలేదు?..వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?’ అని ప్రశ్నలు సంధించారు.పోలింగ్ ఆగిందా?..టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలింగ్ స్టేషన్ 202లో ఒక గంటసేపయినా పోలింగ్ ఆగిందా?. నిజంగానే ఎమ్మెల్యేనే ధ్వంసం చేస్తే అధికారులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. సిట్ అధికారులకైనా ఎమ్మెల్యేపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. కానీ లోకేష్ మాత్రం ఎమ్మెల్యే ఒక వీడియోను రిలీజ్ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది.ఈసీపై సెటైర్లు..కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు. వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారు. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి?. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రెంటచింతల మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారు. ఆ సీఐ అత్యంత వివాదాస్పదుడు. గతంలో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని సీఐగా ఎలా పంపించారు?. పదకొండు రోజుల తర్వాత పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. సిట్ బృందానికి కూడా ఈ కేసుల గురించి చెప్పలేదు. పిన్నెల్లి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతీ పోలీసు అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.