... అంత సీన్ లేదు | film stars failure in politics | Sakshi
Sakshi News home page

... అంత సీన్ లేదు

Published Tue, Apr 22 2014 1:30 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

... అంత సీన్ లేదు - Sakshi

... అంత సీన్ లేదు

బ్యాలెట్ వద్ద బాక్సాఫీస్ తారల బోల్తా 2004, 2009ల్లో బోల్తా కొట్టిన సినీ ప్రచారం 
వైఎస్ ముందు చిరు, నందమూరి గ్యాంగ్ కుదేలు
గ్లామర్‌ను నమ్ముకుని పార్టీ పెట్టి మట్టికరిచిన చిరంజీవి
హోల్ ఫ్యామిలీ ప్రచారం చేసినా ఫలితం సున్నా
పవన్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లను పట్టించుకోని జనం
చివరికి చిరంజీవికి కూడా స్వస్థలంలోనే పరాజయం
బాబు కోసం రోడ్డెక్కిన బాలయ్య, జూనియర్
తొడలు కొట్టి, మీసాలు తిప్పి నానాతిప్పలు

 
వైఎస్ విధానాలకే ఓటేసి గెలిపించిన ప్రజలు

బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్:

దిగ్గజ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకసారి ఓ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లారట. ఆ సభకు వందల మంది మాత్రమే వచ్చారు. పక్కనే మరో హాల్లో ఏదో సినీ వేడుక జరుగుతోంది. అతిథి ఓ ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్. ఇంకేముంది... వేలల్లో జనం ఎగబడ్డారట. అది చూసి కొందరు, ‘మీ వంటి పెద్ద శాస్త్రవేత్త వస్తే వందల్లోనే జనాలొచ్చారు... ఒక హీరోయిన్‌కు మాత్రం ఇలా వేలల్లో ఎగబడ్డారేంటి?’ అని ఐన్‌స్టీన్‌ను అడి గారట. ఆయనేం చెప్పారో తెలుసా? ‘తారల తళుకులు ఆకర్షిస్తాయి. వెండి తెరపై నటించే వాళ్లు నేరుగా తమ మధ్యలోకే వస్తే జనం సహజంగానే ఎగబడి చూస్తారు. కాకపోతే... వారిని చూస్తారు... వెళ్తారు. అంతే. అంతకంటే ఏమీ ఉండదు’’ అని. నిజమే కదా. అప్పుడు వేల మందిని రప్పించుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడెవరికీ తెలియదు. కానీ ఐన్‌స్టీన్ మాత్రం ఆచంద్రతారార్కం జనం నోళ్లలో నానుతూనే ఉంటాడు. ఇది కాస్త అటూ ఇటుగా మన రాష్ట్ర రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఎన్నికల వేళ సినీ తళుకులతో జనాలను ఆకర్షించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు మన పార్టీలకు, ముఖ్యంగా స్వయంగా ఓ సినీ దిగ్గజమైన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి కొత్తేమీ కాదు. కొన్నేళ్ల క్రితం దాకా ఇది కొద్దో గొప్పో వర్కవుట్ అయిందేమో కూడా. కానీ ఇప్పుడు మాత్రం సినీ గ్లామర్‌ను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గత రెండు ఎన్నికల నుంచీ ఇది కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది.
 
 ఈ మార్పుకు ప్రధాన కారణం ‘వైఎస్ ఫ్యాక్టరే’నని చెప్పాలి. 2004లో స్వయానా చిరంజీవి సహా సినీ పరిశ్రమంతా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచినా... 2009లో నందమూరి వంశమంతా కాలికి బలపం కట్టుకుని మరీ చంద్రబాబు జపం చేసినా... దానికి తోడు అప్పటికి మెగాస్టార్‌గా వెలిగిపోతున్న చిరంజీవి ఏకంగా పార్టీ పెట్టి బరిలో దిగినా... ఆయనకు దన్నుగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి ఫ్యామిలీ హీరోలు మొదలుకుని ఎందరెందరో సినీ జనాలు రంగంలోకి దిగినా... వైఎస్ హవా ముందు వారెవరూ నిలవలేకపోయారు. 2004లో మండుటెండలను కూడా లెక్క చేయకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన చరిత్రాత్మక పాదయాత్రతో ‘వార్ వన్‌సైడ్’ అయిపోవడం అందరికీ తెలిసిన చరిత్రే. ఇక 2009లోనైతే ‘మా పార్టీకి నేనే స్టార్ క్యాంపెయినర్‌ను’ అని ధీమాగా ప్రకటించి మరీ ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించి చూపించిన ధీశాలి వైఎస్. ‘మా బాబే మేలు’ అంటూ ఊదరగొట్టిన నందమూరి నాయకులను, ‘ప్రజారాజ్యం’ తెచ్చేస్తామంటూ అదే పనిగా తొడలు గొట్టిన చిరంజీవులను కాదని... సంక్షేమ పాలనతో ఐదేళ్ల పాటు స్వర్ణయుగాన్ని అందించిన రాజశేఖరరెడ్డికే ప్రజలు ఓటేశారు. అలాగని సినీ తారలను ప్రజలు పట్టించుకోలేదా అంటే  అదేమీ కాదు. 2004లోనూ, 2009లోనూ స్టార్లు ఎక్కడ సభలు పెట్టినా జనం విరగబడ్డారు. కాకపోతే, అదంతా కేవలం సినీ తారల పట్ల ఉండే క్రేజ్‌తో మాత్రమే. వారొస్తే ఎగబడి చూస్తారన్నది ఎంత నిజమో, వారు చెప్పిందల్లా చేయరన్నదీ అంతే నిజం.
 
 చిరు కుటుంబం మొత్తం వీధుల్లోకి వచ్చినా...

 2009లో రాష్ట్ర రాజకీయ వెండితెరపై సినీ గ్లామర్ ఏమాత్రమూ పని చేయలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రజారాజ్యం పార్టీ అట్టర్ ఫ్లాపై చతికిలపడింది. తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్న హీరోగా చిరంజీవి స్థాపించిన ఆ పార్టీ ఎంతటి పరాభవాన్ని మూటగట్టుకుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. యూత్‌లో యమా ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కాలికి బలపం కట్టుకుని తిరిగి ఎంతగా ప్రచారం చేసినా లాభం లేకపోయింది. రాజకీయాలు వేరు, సినిమాలు వేరని తెలుగు ఓటరు స్పష్టంగా తేల్చిచెప్పాడు. నిజానికి చిరు సభలకు జనం విరగబడ్డారు. ఎక్కడికెళ్లినా ఇసుకేస్తే రాలనంత మంది వచ్చారు. పవన్‌తో పాటు మరో సోదరుడు నాగబాబు, తనయుడు రామ్‌చరణ్, మేనల్లుడు అల్లు అర్జున్... ఇలా కుటుంబమంతా రోడ్డెక్కి ప్రచారం చేశారు. చివరికి చూస్తే అధికారం దక్కడం మాట అటుంచి, కనీసం గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకోలేకపోయింది. కనాకష్టంగా 18 అసెంబ్లీ స్థానాలు గెలవగలిగింది. సొంత జిల్లాలోని పాలకొల్లు అసెంబ్లీ స్థానంలో చిరంజీవే ఓటమి పాలయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ఎంపీ సీటైతే ఒక్కటి కూడా రాలేదు.
 
 టీడీపీని గట్టెక్కించలేకపోయిన నందమూరి వంశం
 
ఇక చంద్రబాబు కోసం భారీ ైడె లాగులు, మీసాలు మెలేయడాలు, తొడ కొట్టడాలతో నందమూరి నాయకులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని పాట్లు పడ్డా వారిని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. చిరంజీవి రంగంలో ఉండటంతో సినీ గ్లామర్‌కు సినీ గ్లామరే విరగుడనే వ్యూహంతో జూనియర్ ఎన్టీఆర్‌ను బాబు రంగంలోకి దించారు. రానంటూ మొరాయించినా ఒత్తిడి చేసి మరీ జూనియర్‌ను ప్రచార రథమెక్కిచ్చారు బాబు. దివంగత ఎన్టీఆర్ వేషధారణతో, అదే సంభాషణ చాతుర్యంతో ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ జూనియర్ సుడిగాలి ప్రచారం చేశారు. అయినా లాభం లేకపోయింది.
 
 ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహించినప్పటికీ అక్కడ పోటీ చేసిన 53 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది కేవలం పదే. ఇక ఎన్టీఆర్ వారసుడినంటూ బాలయ్య బాబు మీసం మెలేస్తూ, తొడలు కొడుతూ అభిమానులను అలరించినా ఓట్లు మాత్రం రాబట్టుకోలేకపోయారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరని తెలుగు ఓటరు స్పష్టమైన తీర్పునిచ్చాడు. వైఎస్ సుపరిపాలనకే ఓటేశాడు. మురళీమోహన్, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, బాబుమోహన్, నరేష్ వంటి పలువురు సినీనటులు కూడా 2009లో ఘోరంగా ఓడిపోయారు. జయసుధ (కాంగ్రెస్), విజయశాంతి (టీఆర్‌ఎస్) గెలిచినా అందుకు వైఎస్ పాలన, తెలంగాణ సెంటిమెంటే కారణం తప్ప వారి కరిష్మా కాదు.
 
 విధానాల ముందు ‘వేషాలు’ కుదరవు
 
రాజకీయాలంటే కుప్పిగంతులు వేయడం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలు ఎప్పుడో గ్రహించారు. కానీ పాపం కొందరు రాజకీయ నాయకులే ఇంకా గుర్తించడం లేదు. ఎన్నికలు విధానాల ప్రాతిపదికన, పార్టీల ఎన్నికల ప్రణాళిక ఆధారంగా జరుగుతాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని ప్రజలు అంచనా వేస్తారు. ఏ పార్టీకి ఓటేస్తే ప్రయోజనమో అంచనా వేసుకొని గానీ ఓట్లేయరు. 2009లో ఒకవైపు చిరంజీవి పీఆర్పీ అన్నా... టీడీపీ ఎన్టీఆర్ వారసులందరినీ వీధుల్లోకి తీసుకొచ్చినా... జనం వైఎస్సార్‌కే పట్టం కట్టారంటే ఆయన ఐదేళ్ల పాలనే కారణం. ఆరోగ్యశ్రీని చూసి బడుగు బలహీనవర్గాలు ఓటేశాయి.
 
  ఫీజు రీయింబర్స్‌మెంట్ చూసి విద్యార్థులు, పెన్షన్ చూసి వృద్ధులు, వితంతువులు, రుణాల మాఫీ చూసి రైతులు, ఉపాధి హామీని చూసి కూలీలు... ఇలా అన్ని వర్గాలూ వైఎస్‌ఆర్ పథకాలకు ఓటేశాయి. ఆయన పాలనతోనే తమ జీవితాలు బాగుపడతాయని వారు నమ్మారు. ఎన్నికల సందర్భంగా సినీ తారలు వచ్చినప్పుడు సరదాగా సినిమా చూసొచ్చినట్లు జనం వారి సభలకు వెళ్లి వస్తారు. అంతకుమించి ఒరిగేదేమీ ఉండదు. తమ సిద్ధాంతాలపై, విధానాలపై నమ్మకం లేని నేతలే సినీ గ్లామరని, మరోటని మాయ చేయజూస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement