
సీనియర్లకు మొండి చెయ్యి
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు పాల్పడటం ద్వారా అంపశయ్యపైకి చేరిన కాంగ్రెస్ కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తీరుతో కొత్త కష్టాలు తెచ్చిపెట్టుకుంది. కొత్తవారికి అవకాశం పేరుతో సీనియర్లను పక్కన పెట్టడం పార్టీ వర్గాల్లో కలవరం రేపుతోంది. పేరున్న నేతలకే ఆందోళన కలిగిస్తున్న ఈ ఎన్నికల్లో జూనియర్లకు.. పార్టీ శ్రేణులకే తెలియని కొత్త ముఖాలకు అభ్యర్థిత్వాలు కట్టబెట్టడం వల్ల ఎన్నికల్లో పార్టీ అవకాశాలు మరింత దిగజారిపోతాయని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవకాశం ఇస్తారని సీనియర్లు ఉక్రోషం వెళ్లగక్కుతున్నారు. ఆదివారం రాత్రి ఏఐసీసీ ప్రకటించిన సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాల్లో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నింటికీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మూడు కొత్త ముఖాలు చోటు చేసుకున్నాయి. ఎంపీతోపాటు సిటింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పించారు.
ఎంపీ అభ్యర్థులు వారే
శ్రీకాకుళం లోక్‌సభతోపాటు జిల్లాతో అనుబంధం ఉన్న విజయనగరం, అరకు పార్లమెంట్ స్థానాలను సిట్టింగులైన డాక్టర్ కిల్లి కృపారాణి, బొత్స ఝాన్సీ, కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్‌లకే ఖరారు చేశారు. కృపారాణి 2004లో ఓటమి చెందగా, 2009లో ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. అరకు ఎంపీగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఈయన ఇప్పటి వరకు నాలుగుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక కాగా.. ఓసారి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. విజయనగరం స్థానానికి ఖరారైన బొత్స ఝాన్సీ రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
మూడు చోట్ల సిటింగ్‌లే..
ఆమదాలవలస, రాజాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఆమదాలవలస నుంచి బొడ్డేపల్లి సత్యవతి, రాజాం నుంచి రాష్ట్ర మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్, పాలకొండ నుంచి నిమ్మక సుగ్రీవులు మళ్లీ పోటీ చేస్తారు.
బొడ్డేపల్లి సత్యవతి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. కోండ్రు మురళీమోహన్ 2004లో ఎచ్చెర్ల నుంచి, 2009లో రాజాం నుంచి గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గం లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నిమ్మక సుగ్రీవులు 2009లో రాజకీయ అరంగ్రేటం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలాస, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాలకు 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన వారిని ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. పలాస నియోజకవర్గానికి వంకా నాగేశ్వరరావు, నరసన్నపేట నియోజకవర్గానికి డోల జగన్, పాతపట్నం నియోజకవర్గానికి పాలవలస కరుణాకర్‌లను ఖరారు చేశారు.
టెక్కలి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు పూర్తిగా కొత్త అభ్యర్థులను ఎంపిక చేశారు. టెక్కలి నియోజకవర్గానికి కేంద్ర మంత్రి కృపారాణి భర్త డాక్టర్ కిల్లి రామ్మోహనరావును ఎంపిక చేశారు. ఈయన రాజకీయాలకు కొత్త కానప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే ప్రథమం. శ్రీకాకుళం నియోజకవర్గానికి చౌదరి సతీష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. చిరంజీవి అభిమాన సంఘం నాయకుడైన ఈయన 2009లో పీఆర్పీ తరపున పనిచేశారు. కేంద్రమంత్రి వర్గంలో కృపారాణికి స్థానం లభించిన తరువాత కాంగ్రెస్‌లో చేరి ఆమె అనుచరుడిగా ఉన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గానికి కిలారి రవికిరణ్‌ను ఎంపిక చేశారు. ఈయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తండ్రి కిలారి సత్యనారాయణ పంచాయతీ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన తరువాత తెలుగుదేశం పార్టీలో పలు పదవులు చేపట్టారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే సీనియర్లను కాదని జూనియర్లకు టిక్కెట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ క్యాడర్ మండిపడుతోంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి రవికిరణ్‌ను అభ్యర్థిగా ఖరారు చేయడం పట్ల ఆ నియోజకవర్గ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవలే పార్టీలోకి వచ్చిన చౌదరి సతీష్ ఎంపికను పలువురు నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పటికే జోడు పదవులున్న డోల జగన్‌ను నరసన్నపేట అభ్యర్థిగా నిర్ణయించడాన్ని కూడా సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కష్టకాలంలో కూడా సీనియర్లను గుర్తించకుంటే తాము పార్టీలో ఉండడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలువురు నాయకులు, కార్యకర్తలు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే వీలుంది.