కుమ్మక్కు కుట్ర!
కుమ్మక్కు కుట్ర!
Published Wed, Mar 19 2014 3:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:కేంద్రమంత్రి కిల్లి కృపారాణి.. రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు మురళీ.. వీరిద్దరే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌కు ఆశా కిరణాలు. గాలిలో దీపంలా మిణుకు మిణుకుమంటున్న పార్టీ దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టాల్సిన వీరికే మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమను తాము జాతీయ, రాష్ట్ర నేతలుగా భావిస్తున్న ఈ నేతలిద్దరూ తమ నియోజకవర్గాల్లోనే సంకట స్థితిని ఎదుర్కొం టున్నారు. వీరి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారి పోయింది. స్థానిక ఎన్నికల్లోనే పరిస్థితి దారుణంగా ఉండటంతో సార్వత్రిక ఎన్నికలంటేనే వీరిద్దరూ బెంబేలెత్తుతున్నారు. దాంతో ఎలాగైనా పరువు దక్కించుకోవాలి.. ఉనికి కాపాడుకోవాలన్న లక్ష్యంతో కుమ్మకు రాజకీయాలకు తెరతీశారు. ప్రస్తుత మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీకి సహకరించి.. అనంతరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వారి సహకారం తీసుకోవాల న్నది వీరి వ్యూహం. ఈ మేరకు టీడీపీ ద్వితీయశ్రేణి నేతలతో కృపారాణి, కోండ్రు మురళీ మ్యాచ్ ఫిక్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న ట్లు సమాచారం.
కృపారాణి వ్యూహాలు
సార్వత్రిక ఎన్నికల గండం భయపెడుతుండటంతో కేంద్రమంత్రి కృపారాణి కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశారు. అవకాశం ఉన్న ప్రతి చోటా టీడీపీ అసెంబ్లీ నియోజవకర్గ నేతలతో తెరచాటు ఒప్పందాలకు యత్నిస్తున్నారు. అందుకోసం మున్సిపల్, మండల-జిల్లా పరిషత్తు ఎన్నికలను అవకాశంగా మలచుకుంటున్నారు. ఈమేరకు ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాలిటీల్లోని తన వర్గీయులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇచ్ఛాపురంలో ఇప్పటికే కేంద్రమంత్రి అనుచరగణం టీడీపీతో జట్టు కట్టింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము టీడీపీ అభ్యర్థులను బలపరుస్తామని అక్కడి కాంగ్రెస్ నేత లల్లూ వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ స్వర్ణమణి మంగళవారం బహిరంగంగానే ప్రకటించారు.
అందుకు ప్రతిఫలంగా ఎంపీ ఎన్నికల్లో ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని టీడీపీ నేతలు కృపారాణికి సహకరించేలా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. పలాస మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు ఒడిగట్టాయి. అన్ని వార్డు ల్లో అభ్యర్థులను బరిలో నిలపలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. దాంతో కేంద్రమంత్రి తన వర్గీయులకు కర్తవ్య బోధ చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఓ సామాజిక వర్గానికి చెందినవారికి ఆమె స్పష్టమైన సూచనలు చేశారు. దాని సారాంశం కూడా ఇచ్ఛాపురంలో కుదిరిన ఒప్పందం లాంటిదే. ఆమదాలవలసలో తన సొంతింటి ప్రత్యర్థి ఎమ్మెల్యే సత్యవతిని దెబ్బతీయడానికి కృపారాణి రంగంలోకి దిగారు. మున్సిపల్, మండల,జెడ్పీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించడానికి ఆమె అనుచరులు సిద్ధపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎన్నికల్లో వారి సహకారం తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
అదే దారిలో కోండ్రు
జిల్లా కాంగ్రెస్‌కు భవిష్యత్తు నేతగా తనను తాను ఊహించుకుంటున్న కోండ్రు మురళీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు టీడీపీ వర్గీయులతో కుమ్మక్కయ్యేందుకు సిద్ధపడ్డారు. కోండ్రు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాం నియోజకవర్గంలోని మెజార్టీ కాంగ్రెస్ నేతలు రాజీనామా బాట పట్టారు. దాం తో ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దీటైన అభ్యర్థులను బరిలో నిలపలేని దుస్థితికి కాంగ్రెస్ దిగజారింది. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన మాజీ మం త్రి రాజాం నియోజకవర్గంలోని టీడీపీ వర్గీయులతో మంతనాలు సాగిస్తున్నా రు. ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీ పీ అభ్యర్థులకు సహకరిస్తానని వర్తమా నం పంపినట్లు తెలుస్తోంది. అందుకు వీలుగా కాంగ్రెస్ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెడతామన్నది ఆయ న ప్రతిపాదన. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నేతలు తనకు సహకరించాలని ఆయన కోరుతున్నారు. రేగిడి, వంగర మండలాల్లో ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు అంగీకరించారని సమాచారం.
Advertisement
Advertisement