
ఓటు వేసిన షర్మిల, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ విజయమ్మ
సీమాంధ్రలో ఓట్ల పంట పండింది. ఓటర్లు ఒక్కుమ్మడిగా పోలింగ్ బూత్‌లకు పోటెత్తారు. యువత, వృద్ధులు, మహిళలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు.
చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
కొయ్యూరు మండలంలోని ఒక్క కేంద్రంలో రీ పోలింగ్
స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు.. కేంద్ర బలగాలతో కాపలా
అభ్యర్థులు వాటివద్ద ఉండేందుకు అనుమతి: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ఓట్ల పంట పండింది. ఓటర్లు ఒక్కుమ్మడిగా పోలింగ్ బూత్‌లకు పోటెత్తారు. యువత, వృద్ధులు, మహిళలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. దాంతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. 2009 ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా సీమాంధ్రలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ‘‘77 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రాథమికంగా నివేదికలు వచ్చాయి. అది 80 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని కలెక్టర్లు తెలిపారు’’ అని భన్వర్‌లాల్ వివరించారు. మూడు చోట్ల స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగిందని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను బుధవారం రాత్రికల్లా స్ట్రాంగ్ రూములకు తరలించారు. వాటి వద్ద కేంద్ర సాయుధ పోలీసుల బలగాల కాపలా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గానీ వారి ఏజెంట్లు గానీ స్ట్రాంగ్ రూముల వద్ద ఉండేందుకు సౌకర్యాలు కల్పించనున్నట్టు భన్వర్‌లాల్ తెలిపారు. స్ట్రాంగ్ రూముల లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మే 16న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామన్నారు. మొత్తంమీద 21,258 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ చేశామని, దాన్ని మండల కేంద్రాల్లో ప్రజలు తిలకించారని చెప్పారు. విశాఖపట్నం జిల్లా పాడేరు అసెంబ్లీ స్థానం పరిధిలోని కొయ్యూరు మండలం పాలకజీడిలోని 68వ పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటలప్పుడు ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బంది జీపుతో సహా రెండు ఈవీఎంలను తగలబెట్టారు. ఆ ఒక్కచోట రీపోలింగ్‌కు అనుమతించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు భన్వర్‌లాల్ తెలిపారు. ఇంకెక్కడైనా రీ పోలింగ్ అవసరమా లేదా అనే విషయాన్ని పరిశీలించాక గురువారం కలెక్టర్లు నివేదిక పంపుతారన్నారు. విజయనగరం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరుల్లో సాయంత్రం భారీ వర్షం కురిసినా అప్పటికే పోలింగ్ 76 శాతం నమోదైందన్నారు.
ఏఎస్పీపై దాడి అవాస్తవం: భన్వర్‌లాల్
కడప జిల్లా దేవగుడి గ్రామంలో ఏఎస్పీపై దాడి జరిగినట్టు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని భన్వర్‌లాల్ ప్రకటించారు. ‘‘ఆయనపై ఎవరూ దాడి చేయలేదు. అక్కడ చిన్నపాటి తోపులాట మాత్రమే జరిగింది. ఆ సందర్భంగా రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి’’ అని వివరించారు. ‘‘గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. ఎవరూ గాయపడలేదు. జిల్లాలో మరోచోట ఇరు వర్గాల ఘర్షణను నివారించేందుకు లాఠీచార్జి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గం పరిధిలో ఎనుగంటివారిపేటలో గుండెపోటుతో ఒకరు, కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం సోమవరం గ్రామంలో ఎండ త్రీవతతో ఒకరు మృతి చెందారు’’ అని చెప్పారు.
దొరికిన సొమ్ము రూ.152 కోట్లు: బుధవారం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోటిన్నర రూపాయల చొప్పున, కడపలో రూ.56 లక్షలు, కర్నూలులో రూ.84 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు భన్వర్‌లాల్ వివరించారు. ‘‘దీంతో మొత్తంమీద రాష్ట్రంలో ఇప్పటిదాకా రూ.152 కోట్లు, దేశవ్యాప్తంగా రూ.283 కోట్లు దొరికాయి’’ అని చెప్పారు.
పోలింగ్ విశేషాలు
- సాయంత్రం 6 గంటలు దాటినా కృష్ణాతో పాటు పలు జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండటం కన్పించింది. వారందరికీ ఓటేసే అవకా శం కల్పించారు
- పలు పోలింగ్ కేంద్రాల్లో ఏకంగా రాత్రి 8 గంటల దాకా పోలింగ్ కొనసాగింది
- ఉదయం 9 గంటల వరకే 15 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 33.40 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 51.25, సాయంత్రం ఐదింటికల్లా 72 శాతానికి చేరింది
- ఎప్పట్లాగే చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలింగ్ నిర్వహించారు.