కల్వకుర్తిలో ముఖాముఖి
అసెంబ్లీ నియోజకవర్గం: కల్వకుర్తి
ప్రత్యేకతలు: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజన తండాలు అధికంగా ఉన్నాయి.
వ్యవసాయమే ప్రధాన ఆధారం. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక్కడి ప్రజలకు పండుగే. కాలువ తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి.అయితే నీటి విడుదల ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
నియోజకవర్గంలో మండలాలు: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సొంత మండలం మాడ్గులతోపాటు, ఆమన్‌గల్, వెల్దండ, తలకొండపల్లి, కల్వకుర్తి.
మొత్తం ఓటర్లు : 1.93 లక్షలు
ప్రధాన అభ్యర్థులు
కల్వకుర్తి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాంత్‌రావు: కల్వకుర్తి నియోజకవర్గం 1989 శాసనసభ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. ఆ ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావునే ఇక్కడి ప్రజలు కంగుతిని పించారు. ఇక్కడ నుంచి ఎన్టీ రామారావుపై చిత్తరంజన్‌దాస్ ఘన విజయం సాధించడంతో ఆయన జెయింట్ కిల్లర్‌గా పేరొందారు. ప్రధాన పార్టీలన్నీ రంగంలో ఉన్నా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి మధ్యే పోటీ నెలకొని ఉంది.
‘ఫ్యాన్’తో కొత్త గాలి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎడ్మ కిష్టారెడ్డికి ప్రజల మనిషిగా మంచి పేరుంది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతారని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. కల్వకుర్తి పట్టణంలో కూరగాయల మార్కెట్ కాలిపోయినప్పుడు బాధితుల కంటే ముందే అక్కడకు చేరుకున్న కిష్టారెడ్డి మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు అక్కడే ఉండడమేకాక చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించారని ఆ వ్యాపారుల సంఘం కార్యదర్శి శ్రీశైలం చెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్లు ఈశ్వరప్ప అనే వ్యవసాయదారుడు వెల్లడించారు. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అదీకాక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న నాయకులు, కార్యకర్తలను ఆయన చేరదీస్తూ ముందుకు సాగుతున్నారు.
గ్రూపులతో ‘హస్త’వ్యస్తం: ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డికి ఆ పార్టీలోని గ్రూపు తగదాలు ముచ్చెటమలు పట్టిస్తున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వర్గం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఓ ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత కశి నారాయణరెడ్డి కాంగ్రెస్ రెబెల్‌గా ఉండడమేకాక, ప్రచారాన్ని గట్టిగా సాగిస్తున్నారు. జైపాల్‌రెడ్డి వర్గం నారాయణరెడ్డికి మద్దతుగా నిలిచిం ది. వంశీచందర్‌రెడ్డికి మాజీమంత్రి డి.కె.అరుణ మద్దతు ఉన్నప్పటికీ ఆమె ఇక్కడకు వచ్చి ప్రచారం చేసే అవకాశం లేదు. యువకుడైన వంశీ ఒంటరి ప్రచారం సాగిస్తున్నారు.
జంపింగే మైనస్: తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్ అయిన జైపాల్ యాదవ్‌కు పార్టీ మారడమే మైనస్ పాయింట్‌గా మారింది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న బాలాజీ సింగ్ రెబెల్ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఆయన వెంటే టీఆర్‌ఎస్ కేడర్ వెళ్లారు. ఇక జైపాల్ వెంట ఒకటి రెండు మండలాల నుంచి మాత్రమే టీడీపీ కేడర్ టీఆర్‌ఎస్‌లో చేరింది. గడిచిన ఐదేళ్లలో జైపాల్‌యాదవ్ చేసిన కార్యక్రమాలు ఏవీ లేవని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
లిఫ్టివ్వని ‘సైకిల్’: బీజేపీ-టీడీపీ పొత్తులో ఇక్కడ పోటీ పడుతున్న ఆచారికి టీడీపీ సహకారం లభించడం లేదు. ఆచారికి ఆమన్‌గల్ మండలంలోనే కాస్త పట్టుంది. ప్రతిసారి పోటీ చేయడం ఓడిపోవడం రివాజుగా మారింది. మిగిలిన మండలాల్లో టీడీపీ బలంపై ఆధారపడాలి, కానీ ఆశించిన స్థాయిలో కలయిక లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.