డీలా..! | Telugu desam party not having confindence to win in elections | Sakshi
Sakshi News home page

డీలా..!

Published Fri, Apr 25 2014 2:56 AM | Last Updated on Tue, Aug 14 2018 5:45 PM

Telugu desam party not having confindence to win in elections

సాక్షి ప్రతినిధి, కడ ప: తెలుగుదేశం పార్టీ పుంజుకుంది.. సర్వేలు అనుకూలంగా నిలుస్తున్నాయి.. అంటూ ఇంతకాలం తెలుగుతమ్ముళ్లను ఆపార్టీ నేతలు ఊరడించారు.. ఎన్నికల ప్రచారంలో ప్రజలు తద్భిన్నంగా వ్యవహరిస్తుండటంతో అభ్యర్థులు డీలా పడుతున్నారు. ఎన్నికల్లో గెలుపు దేవుడెరుగు మర్యాద నిలుపుకునే స్థాయిలో ఫలితాలు ఉంటాయా...గత ఉప ఎన్నికలలాగే డిపాజిట్లు గల్లంతు అవుతాయా...అనే సందిగ్ధంలో నేతలు ఉన్నట్లు   విశ్లేషకులు భావిస్తున్నారు.
 ఎన్నికలు ఏవైనా సరే జిల్లాలో ప్రజాతీర్పు ఏకపక్షమేనని పలు ఫలితాలు స్పష్టం చేశాయి. వైఎస్ కుటుంబం వెన్నంటే జిల్లా ప్రజానీకమని రుజువు చేశా రు. రాబోయే ఎన్నికల్లో సైతం అదే ఆదరణ వైఎస్సార్‌సీపీకి దక్కనుందని పరిశీలకులు భావిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ నేతల్లో  అనైక్యత, ఆపార్టీ నేతలు నేల విడిచి సాము చేస్తుండటం కూడా వైఎస్సార్‌సీపీకి  కలిసివచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో సగం స్థానాల్లో ప్రభావం చూపుతామని భావించిన తెలుగుతమ్ముళ్లు ప్రస్తుత పరిస్థితులు చూసి నిరాశ చెందుతున్నారు. బీజేపీతో పొత్తు ఒక కారణమైతే, జిల్లా వాసి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుస్తుండటం  ఇందుకు మరో కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.
 
 పరువు నిలుపుకునే ఫలితాలు వస్తాయా...!
 ఫలితాలు వెల్లడి కాకపోయినా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఎటూ తప్పదని  తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. అయితే సార్వత్రిక  ఎన్నికల్లో ఎంతోకొంత అనుకూలంగా ప్రజానీకం  ఉంటారని భావించిన  అంచనాలకు ఏమాత్ర ం పొంతన కుదరడం లేదని ఆపార్టీ సీనియర్ నేతలు బహిరంగంగా పేర్కొంటున్నారు. ప్రజల్లో విశ్వాసం నింపేలా పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు కన్పించలేదని అందుకు కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   
 
 వలస నేతల కలయిక లాభిస్తుందని తెలుగుతమ్ముళ్లు భావించగా అదే ప్రతిబంధకమైనట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇందుకు కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలు నిదర్శనంగా  నిలుస్తున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. తాను రెండు సార్లు ఓడిపోయానని, ఈమారు ఓటమి చెందితే అంతకంటే ఇంకో అవమానం ఉండదని ఓ అభ్యర్థి ముఖ్యఅనుచరులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
 
 ప్రచారంలో సైతం కరువైన ఆదరణ...
 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదివరకు పోటీ చేసిన కమలాపురం నేత పుత్తానరసింహారెడ్డికి గతంలో లభించిన ప్రజాదరణ కంటే ఈమారు భిన్నంగా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. రెండు పర్యాయాలు ఓటమి చెందిన ఆయనకు ఈమారు సానుభూతి పని చేస్తుందని భావించారు. అయితే తాజా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, పుత్తా కలయిక ప్రతిబంధకంగా మారినట్లు తెలుస్తోంది. ఇరువురు మధ్య గతంలో చోటు చేసుకున్న ఘర్షణలు, వీరికోసమే గ్రామాల్లో ఏర్పడిన వర్గ కక్షలు... ఇవన్నీ కూడా ప్రస్తుతం తీవ్ర ఆటంకాలుగా మారినట్లు సమాచారం. రాజకీయాల కోసం నేతలు నైతిక విలువలకు సమాధి కడుతున్నారని, విశ్వసనీయతతో వ్యవహరిస్తున్న వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలనే దిశ గా ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజంపేట, మైదుకూరు, రాయచోటి నియోజక వర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది.  పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని ఆయన సామాజిక వర్గం మొదట్లో అండగా నిలిచింది. అంతలోనే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి  మద్దతు  లభించడంతో ఆ సామాజిక వర్గ నేతలతో పాటు టీడీపీ సీనియర్ నేతలను  సైతం విస్మరించినట్లు తెలుస్తోంది.
 
 దాంతో కాకి నడక, హంస నడక రెండింటికి ఎటూ కాకుండా ప్రచారం సాగుతోంది. రాజంపేటలో టీడీపీ బలానికి మేడా తోడైతే మరింత పటిష్టంగా నిలుస్తామని ఆపార్టీ విశ్వసించింది. అయితే వారి అంచనాలు ఏమాత్రం అనుకూలంగా సాగ డం లేదని పలువురు పేర్కొంటున్నారు. గత ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథరెడ్డికి  76,951 ఓట్లు లభించాయి. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి, టీడీపీ అభ్యర్థి బ్రహ్మయ్యలకు కలిపి 60,149 ఓట్లు దక్కాయి. ఆ ఇరువురు ప్రస్తుతం కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నా  ప్రతి మండలంలో ఉప ఎన్నికల్లో వారిని బలపర్చిన నేతలు ఈమారు ఆదరించడం లేదని సమాచారం.
 
 దాంతో డబ్బు, మద్యం, నాటు సారాను కాన్యాయ్‌లో వెంట తీసుకెళ్తూ విపరీతంగా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాయచోటిలో సైతం మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు అనుచరులు టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డిని ఆదరించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎక్కడికక్కడ వలసలు పార్టీకి ప్రతిబంధకంగా మారుతుండటంతో అభ్యర్థులు ముందే కాడి కింద పడేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా గ్రామీణ నేతల కోర్కెల చిట్టాకు ఏమాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది. మాటలతోనే కాలయాపన చేస్తున్నట్లు  సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement