
ఆశలన్నీ ఐదు సంతకాలపైనే..
‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పంట రుణాలు రద్దు చేశారు. రైతులను అప్పుల ఊబినుంచి గట్టెక్కించారు. ఆయన పోయాక అన్నదాతలు మళ్లీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయూరు.
సాక్షి, ఏలూరు :‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పంట రుణాలు రద్దు చేశారు. రైతులను అప్పుల ఊబినుంచి గట్టెక్కించారు. ఆయన పోయాక అన్నదాతలు మళ్లీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయూరు. ఆదుకునే నాథుడే లేకుండాపోయారు...’ ఇది కర్షకుల ఆవేదన. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన రైతుల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది.
‘డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని రాజన్న బిడ్డ జగన్ హామీ ఇస్తున్నారు. ఏ కార్డు కావాలన్నా గ్రామాల్లోనే ఇస్తానంటున్నారు. బెల్టు షాపులన్నీ తొలగిస్తామంటున్నారు. ప్రశాంతంగా బతకడానికి ఇంతకన్నా ఏం కావాల’ని మహిళలు పేర్కొంటున్నారు. ఎవరెన్ని చెప్పినా.. ఇచ్చిన హామీలను తీర్చేది మాత్రం వైఎస్ కుటుంబ మొక్కటేనంటూ ఘంటాపథంగా చెబుతున్నారు.
ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఎలా ఉన్నప్పటికీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇస్తున్న ఐదు సంతకాల హామీ అందరినీ ఆలోచింపచేస్తోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్లు ఐదు సంతకాలపైనే చర్చించుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రచారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇస్తున్న హామీలను నిశితంగా గమనిస్తున్నారు. పేదలకు ఏటా 10 లక్షల ఇళ్లు నిర్మిస్తానంటూ వైఎస్ జగన్ ప్రకటిం చడం గూడు లేని పేదల్లో ఆశలు చిగురింపజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది పేదలకు ఇది వరంలా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
డ్వాక్రా రుణాల రద్దుపై ఆశలు
తాను అధికారంలోకి రాగానే చేసే ఐదు సంతకాల్లో నాలుగోది డ్వాక్రా రుణాల మాఫీ కోసమేనంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిఇచ్చిన హామీ పై డ్వాక్రా మహిళలు ఆశలు పెట్టుకున్నారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఇదే అంశంపై మహిళల్లో చర్చ జరుగుతోంది. ‘జగనన్న గెలిస్తే రుణాలు రద్దు చేస్తాడంట కదా’ అంటూ మహిళలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఇదే జరిగితే, జిల్లాలో 51 వేల మహిళా సంఘాలు తీసుకున్న రూ.420 కోట్ల రుణాలు రద్దవుతాయని అంచనా.
అదేవిధంగా బెల్టుషాపులపై దృష్టి సారిస్తే జిల్లాలో ఉన్న 3 వేలకు పైగా అనధికార మద్యం దుకాణాలు మూతపడతాయని అంచనా. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని పెంచుతానంటూ ఇస్తున్న హామీ మోడువారిన జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. అటు పల్లె జనం అభిప్రాయాలకు అనుగుణంగా పట్టణాల్లోని ఓట ర్లూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, ఏలూరు నగరపాలక సంస్థలోనూ ఫ్యాన్‌గాలి జోరందుకుంది.
జగన్‌తోనే జనరంజక పాలన
ప్రజలతో మమేకమై వారి సాధకబాధకాలను గుర్తెరిగి సకాలంలో వాటిని పరిష్కరించే నాయకుడు వైఎస్ జగనేనన్న భావన పల్లె జనంలో పాతుకుపోయింది. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోయిన పేద కుటుంబాలు జగన్‌మోహన్‌రెడ్డి పెడతానంటున్న ఐదు సంతకాలపై ఆశలు పెంచుకుని రాజన్న రాజ్యం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అధికార కాంక్షతో బరిలోకి దిగిన టీడీపీ వీరి ఆశల్లో నీళ్లు చల్లేందుకు కుయుక్తులు పన్నుతోంది. సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తామంటూ ఆచరణ సాధ్యం కాని హామీలను మరోసారి కుమ్మరిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నిర్ణయమే కీలకం కానుంది.