పాతబస్తీలో కట్టలుగా డబ్బు.. కిలోల కొద్దీ బంగారం
పాతబస్తీలో కట్టలు కట్టలుగా డబ్బులు, కిలోల కొద్దీ బంగారం బయటపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత కొన్ని రోజులుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానమైన ప్రాంతాలన్నింటిలోనూ భారీగా బలగాలను మోహరించి ప్రతి ఒక్క వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లోనే మహా అయితే ఒక్కో సోదాలో 13 లక్షలు, 15 లక్షలు బయటపడుతుంటే, పాతబస్తీలో దొరుకుతున్న సొమ్ము చూస్తే మాత్రం పోలీసులే కళ్లు తేలేస్తున్నారు.
నిన్న కాక మొన్న.. ఒక వాహనంలో రెండు కోట్ల రూపాయల నగదును పోలీసులు పాతబస్తీలోని టప్పాచబుత్రా పోలీసుస్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం నిర్వహించిన తనిఖీలలో రెండు కిలోల బంగారం కూడా స్వాధీనం అయ్యింది. అలాగే పాతబస్తీలోనే గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు నుంచి 36 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా భారీ మొత్తంలో నగదు, బంగారం పాతబస్తీలో బయటపడుతూ చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.