చీకటి వ్యాపారంతో తాతయ్య బిజీ! | I busy with the business of the dark! | Sakshi
Sakshi News home page

చీకటి వ్యాపారంతో తాతయ్య బిజీ!

Published Sat, May 3 2014 1:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చీకటి వ్యాపారంతో తాతయ్య బిజీ! - Sakshi

చీకటి వ్యాపారంతో తాతయ్య బిజీ!

  •  చేరదీసిన నేతకే వెన్నుపోటు
  •   కాకిరాయి అక్రమరవాణాపైనే ఆసక్తి
  •   తమ్ముడే షాడో ఎమ్మెల్యే
  •   జర్నలిస్టుల పైనా దాడికి వెనుకాడని నైజం
  •  జగ్గయ్యపేట, న్యూస్‌లైన్ : ‘మాటల్లో గాంధేయవాదం... చేతల్లో గూడాయిజం’ ఈ వర్ణన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతాయ్య)కు అక్షరాలా సరిపోతుంది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, రాజకీయాల్లో పెంచి పెద్ద చేసిన నేతకే వెన్నుపోటు పొడిచిన ఘనుడిగా నియోజకవర్గ ప్రజలు తాతయ్యను గుర్తించారు. చీకటి వ్యాపారాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి తన ఐదేళ్ల ఎమ్మెల్యే పదవిని చక్కగా వినియోగించుకున్నారు. ఆయన సోదరుడు ధనుంజయ (చిట్టిబాబు) షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తున్నారు. తమ కనుసన్నల్లో ఉండ ని వారిపై దాడులు చేయడానికి కూడా వెనుకాడని నైజం చిట్టిబాబుది.
     
    సామినేనికే వెన్నుపోటు పొడిచి
     
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గతంలో శ్రీరాం తాతాయ్య రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాతాయ్యను మున్సిపల్ చైర్మన్‌గా గెలిపించేందుకు సాయంచేశారు. తాతాయ్యపై ఉన్న నమ్మకంతో జగ్గయ్యపేట పట్టణ నిర్వహణ బాధ్యతలను సామినేని ఆయనకే అప్పగించారు. అయితే ఇంతగా నమ్మిన ఉదయభానును గత ఎన్నికల్లో వెన్నుపోటు పొడవడానికి తాతాయ్య వెనుకాడలేదు. టీడీపీ  వ్యతిరేకిగా రాజకీయాల్లోకి వచ్చి చివరకు ఆ పార్టీ పంచనే చేరి ఎమ్మెల్యేగా గెలిచి వెన్నుపోటులో సిద్ధహస్తుడిగా నియోజకవర్గ ప్రజల్లో గుర్తింపు పొందారు.
     
    కాకిరాయి అక్రమరవాణా
     
    వత్సవాయి మండలంలోని తన ఐరన్‌వోర్ ఫ్యాక్టరీకి చీకటి వేళ  కాకిరాయి అక్రమంగా రవాణా చేస్తూ శ్రీరాంతాతయ్య కోట్లు గడిస్తున్నారు. ఎమ్మెల్యే కాకముందు కాకిరాయి అక్రమంగా రవాణాను గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఫ్యాక్టరీని సీజ్‌చేసింది. ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్‌తో దోస్తీకట్టి ఫ్యాక్టరీని తెరి పించారు. తిరిగి చుట్టుపక్క ప్రాంతాల కాకిరాయిని అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు ఆర్జిం చారు. పన్నులు చెల్లించకుండా అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ వ్యాపారం ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నల్లో యథేచ్ఛగా నడుస్తోంది. పారాబాయిల్డ్ రైస్‌మిల్లుకు కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు తీసుకువచ్చి డబ్బు చెల్లించకుండా బ్యాంక్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.
     
    ఎమ్మెల్యే సోదరుడిదే హవా..
     
    తాతయ్య పేరుకే ఎమ్మెల్యే. హవా అతని సోదరుడు చిన్నబాబుదే. తాతయ్య హైదరాబాద్‌కే పరిమితం కావడంతో చిన్నబాబే ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు చేసే ఇసుక, కాకిరాయి వ్యాపారాల్లో అతని హస్తం ఉండాల్సిందే. అక్రమ వ్యాపారాలు చేసేవారికి ఏదైన జరిగితే చాలు రాజీ చేస్తుంటారు. తానే ఎమ్మెల్యేనని ఇటీవల కార్యకర్తలతో చినబాబు ఫ్లెక్సీలు వేయించి పట్టణంలో ఏర్పాటుచేయించాడు. 2009లో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో నింది తులైన ఈ సోదరులు కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు. కాంగ్రెస్ నేతలతో చేతులు కలపడంతో అప్పటి ఎంపీ లగడపాటి రాజ గోపాల్ వారిని హత్య కేసు నుంచి తప్పించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    జర్నలిస్టుపై దాడి

     
    ఇటీవల చంద్రబాబు జగ్గయ్యపేటలో నిర్వహించిన రోడ్ షో విఫలమైంది. దీనిపై సాక్షి దినపత్రిక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వర్గీయులు జగ్గయ్యపేట సాక్షి విలేకరి విజయ్‌పాల్‌పై దాడి చేశారు. ఈ దాడి వెనుక చిట్టిబాబు హస్తం ఉందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement