
ఐఏఎస్... ఐపీఎస్... ఓ ప్రొఫెసర్!
ఎన్నికలకు మరో వారం రోజులు సమయం మాత్రమే ఉండడంతో తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. పోలింగ్కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు అందరి దృష్టి 'హాట్ సీటు'పై నెలకొంది. మల్కాజ్గిరి లోకసభ స్థానంపై స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల వారు దృష్టి సారించారు. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారో ఇతమిత్థంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యావంతులు పోటీ పడుతుండడంతో అమితాసక్తి నెలకొంది.
ఒక ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్ ప్రత్యర్థులుగా బరిలో ఉండడంతో మల్కాజ్గిరి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర డీజీపీగా పదవీవిరమణ చేసిన దినేష్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ లోక్సత్తా తరపున పోటీకి దిగారు. జర్నలిజం ప్రొఫెసర్ డాక్టర్ కె. నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ఎవరి విజయంపై వారు దీమాగా ఉన్నారు. కిందిస్థాయి నాయకులను కలుపుకుని దినేష్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్, షర్మిల ప్రచారం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. షర్మిల ఇప్పటికే ప్రచారం పూర్తిచేయగా, జగన్ త్వరలో ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. జయప్రకాష్ నారాయణ, నాగేశ్వర్ విద్యావంతుల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురిని ప్రజలను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.