యాచారం, న్యూస్‌లైన్ : ప్రాంతాలకతీతంగా అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలకూ సక్రమంగా సంక్షేమ పథకాల అమలు వైఎస్సార్ సీపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, మల్కీజ్‌గూడ, యాచారం గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు.
ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమవేశాల్లో శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని గెలిపిస్తే రాజన్న సువర్ణ పాలన మళ్లీ ప్రజలకు అందుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వైఎస్ కృషి వల్లే వచ్చిందని, ఆయన ఆనాడు ఎమ్మెల్యేల బృందాన్ని కేంద్రం వద్దకు పంపి ఒత్తిడి తెచ్చారని అన్నారు. దివంగత వైఎస్ రుణం తీర్చుకోవడం కోసం ఆయన ఆశయాల సాధనకు కంకణం కట్టుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ప్రజలకు సుపరిపాలన అందించడమే పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ధ్యేయమని, ఆయన నాయకత్వంలో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత ఏనాడూ ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రాదేశిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జిల్లాలో పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేసి ఇబ్రహీంపట్నం నుంచి ఈసీ శేఖర్‌గౌడ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ కళాకారుల బృందం ఆటపాటలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ అమృతాసాగర్, పార్టీ మండల కన్వీనర్ మోతీరాంనాయక్, ఎంపీటీసీ అభ్యర్థులు సంధ్యారాణి, మల్లమ్మ, నాయకులు దార నర్సింహ, వరప్రసాద్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, వెంకటేష్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీతోనే సంక్షేమ పథకాల అమలు
Published Thu, Apr 10 2014 12:24 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement