జనం కోసం జగన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జగన్ కోసం జనం... జనం కోసం జగన్. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఈ దృశ్యం సాక్షాత్కరించింది. యువనేత రాక కోసం ఐదు గంటలపాటు వేచిచూసి జనం జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటారు. ప్రచార గడువు ముగుస్తున్నా.. పోలీసులు వెళ్లమని ఆదేశించినా అక్కడి నుంచి కదలని ప్రజానీకం... ఆయనొచ్చేవరకు నిరీక్షించారు. తన కోసం వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారని, తాను అక్కడికి చేరేవరకు ప్రచార గడువు ముగిస్తుందేమోనన్న సందేహం కలిగినా.. జనాన్ని కలిసేందుకు వైఎస్ జగన్ వచ్చారు. తన కోసం ఎదురుచూసేవారిని నిరాశపరచరని నిరూపించారు.
తరలివచ్చిన ఆశేష జనవాహిని..
జననేత జగన్ మోహన్‌రెడ్డి కోసం అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గంటల తరబడి నిరీక్షించారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు ఎంతో ఓపికగా ఎదురుచూశారు. వైఎస్సార్‌సీపీ నిర్వహించదలచిన బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగర శివార్లలోని కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్‌లలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇబ్రహీంపట్నం చేరుకునేందుకు కాస్త ఆలస్యమైంది. ఈలోగా ప్రచారగడువు మించిపోయిందని, సభా వేదిక, ప్రాంగణం ఖాళీ చేసి వెళ్లాలని భారీ ఎత్తున హాజరైన ప్రజానీకాన్ని పోలీసులు ఆదేశించారు.
దీంతో వారంతా వెనుదిరిగేందుకు రహదారిపైకి వస్తుండగా అంతలోనే జగన్ వాహనం అక్కడికి చేరుకుంది. యువనేత రాకతో ఉత్సాహం ఉరకలెత్తిన కార్యకర్తలు ఆయనతో కరచాలనం కోసం పోటీపడ్డారు. వాహనం నుంచి బయటకు వచ్చిన జగన్ ..రహదారి వెంట బారులు తీరిన అశేష జనానికి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గంటల తరబడి వేచిచూసినప్పటికీ, జగన్‌ను చూడలేకపోయామని దిగాలుగా వెనుదిరిగిన ఉన్న వృద్ధులు, మహిళలు రోడ్డు పక్కన నిల్చొని రాజన్న బిడ్డను చూసి ఆనంద పరవశులయ్యారు.
పోలీసులు అత్యుత్సాహం
జగన్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రచార గడువు కంటే కొన్ని నిమిషాల ముందే మైకులను నిలిపివేసిన పోలీసులు...సభా వేదిక నుంచి నేతలు దిగాలని ఒత్తిడి చేశారు. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న జగన్‌తో కరచాలనం చేస్తున్న ప్రజలను అడ్డుకున్నారు. జగన్‌ను ముందుకె ళ్లకుండా వెనుదిరగాలని స్థానిక ఏసీపీ సురేందర్‌రెడ్డి సూచించారు. ‘తానేమీ మాట్లాడడంలేదు కదా... నమస్కరించేందుకు అభ్యంతరం ఎందుకు చెబుతున్నారు?’ అని జగన్ ప్రశ్నించారు. ఇంతలోనే అభిమాననేతను చూసేందుకు, కరచాలనం కోసం వెల్లువెత్తిన అభిమానులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అభిమానులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. దీంతో జగన్‌ను సమీపం నుంచి చూసేందుకు వచ్చిన కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.