మోడీకంటే మెరుగైన నేత కావాలి
‘ఎకానమిస్ట్’ పత్రిక వ్యాఖ్య
భారతీయులు రాహుల్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి
అది స్ఫూర్తినివ్వకపోయినా తక్కువ అశాంతికరమైంది
వాషింగ్టన్: లండన్ నుంచి వెలువడే ప్రతిష్టాత్మక పత్రిక ‘ది ఎకానమిస్ట్’ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇబ్బందిపడే వ్యాఖ్యలు చేసింది. ‘భారత్‌కు మోడీ కంటే మెరుగైన నేత కావాలి’ పేరుతో ఈ నెల 5న వెలువడే సంచికలో ఒక వ్యాసం ప్రచురించింది. మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే ఆయన విభజనకారుడని, భారత్‌వంటి సున్నితమైన దేశానికి ప్రధాని కావడం సరికాదని పేర్కొంది.
భారతీయులు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, అది ఏమాత్రం స్ఫూర్తిదాయకమైనది కాకపోయినా తక్కువ అశాంతికరమైందని వ్యాఖ్యానించింది. ‘రాహుల్ సంకీర్ణ కూటమిపై అవినీతి మచ్చపడింది. దీనితో పోలిస్తే మోడీ మచ్చలేని వ్యక్తే. అభివృద్ధికాముకుడని నిరూపించుకున్నారు.
ఇది మెచ్చుకోదగిందే. అయినప్పటికీ భారత ఉన్నత పదవికి మోడీ పేరుకు మేం మద్దతివ్వడం లేదు’ అని పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల కారణంగానే ఆయనకు అభ్యంతరం చెబుతున్నామని వివరించింది. ఈ అల్లర్ల కేసులో ఆయనకు సుప్రీం కోర్టు నియమిత దర్యాప్తు కమిటీ ఇచ్చిన క్లీన్ చిట్‌ను తాము పట్టించుకోవం లేదని, దర్యాప్తులు కొలిక్కి రాకపోవడానికి సాక్ష్యాలు కనుమరుగవడం, వాటిని నాశనం చేయడం కారణమని పేర్కొంది.
మోడీ అల్లర్లలో తన పాత్రపై వివరణ ఇచ్చి, నిజాయతీగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే ఆయనకు మద్దతుపై ఆలోచిస్తామని, అయితే ఆయనెప్పుడూ ఆ పని చే యలేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని మిత్రపక్షాలు మోడీని కాకుండా మరొకరిని ప్రధాని ఎన్నుకోవాలని సూచించింది. ఈ వ్యాసంపై బీజేపీ మండిపడింది. పత్రికకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియదని విమర్శించింది.