కార్తీ చిదంబరం
చెన్నై: శివగంగ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం చిక్కుల్లో పడ్డారు. అతని నామినేషన్‌ను తిరస్కరించాలని ఆదాయపు పన్నుశాఖాధికారులు ప్రధాన ఎన్నికల కమిషన్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. కార్తీ నామినేషన్ పత్రంతోపాటూ సమర్పించిన స్థిర, చరాస్తుల ధృవీకరణ పత్రంలో వాస్తవాలు దాచిపెట్టారని ఆదాయపు పన్నుశాఖాధికారి ఎస్.కె.శ్రీ వాత్సవ ఈసీ దష్టికి తీసుకెళ్లారు.
వ్యాపారం తన వృత్తి అని పేర్కొన్న కార్తీ, తాను చేసే వ్యాపారానికి పెట్టుబడి ఎంత, ఆ వ్యాపారానికి అతను యజమానా, భాగస్తుడా, డైరెక్టరా లేక షేర్లు కొన్నాడా వంటి ఏ వివరాలు పొందపరచలేదని వివరించారు. తమది ఉమ్మడి కుటుంబమని, బ్రైక్రిప్ట్ తోటలోని స్థిరాస్తిలో కార్తీకి, ఇతర కుటుంబ సభ్యులకు వాటా ఉందని గత లోక్‌సభ ఎన్నికల్లో పి.చిదంబరం తన నామినేషన్‌లో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. కార్తీ తన నామినేషన్లో ఆ ఆస్తుల వివరాలను తప్పుగానూ, మార్కెట్ విలువకంటే తక్కువగానూ చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
1951 నాటి ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ, కార్తీ చిదంబరం సమర్పించిన 147 పేజీల నామినేషన్ పత్రాలను ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు పంపుతానని, ఆ నామినేషన్‌లోని వివరాలను ఎన్నికల వెబ్‌సైట్‌లో పెడతామని స్థానిక ఎన్నికల అధికారి వివరించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, శ్రీవాత్సవ చేప్పినవన్నీ నిరాధార ఆరోపణలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదబంరం కొట్టిపారేశారు. అతను కోర్టులో అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.