చిదంబరం
ఎన్నికల పోటీలో లేనేలేని కేంద్ర ఆర్ధిక మంత్రి పళనియప్పన్ చిదంబరం లెక్కలు ఈ సారి తప్పేట్టున్నాయా? అందుకే ఆయన ఎన్నికల పరీక్ష రాయకుండా, తనకు బదులు కొడుకు కార్తిని రంగంలోకి దించారా?తమిళనాట శివగంగ నియోజకవర్గంలో 1984 నుంచి అప్రతిహతంగా సాగతున్న చిదంబరం విజయపరంపర ఈ సారి ఆగిపోవడం ఖాయమేనా?
ఛార్టర్డ్ అకౌంటెంట్ గా, బ్యాంకర్ గా, రాజీవ్ గాంధీ ప్రసంగాల తమిళ అనువాదకుడుగా, మంచి డిబేటర్ గా పేరున్న చిదంబరం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయినా ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ సారి చిదంబరం పోటీ చేయక, కార్తి ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం దాదాపు చరమాంకంలోకి ప్రవేశించినట్టే.
ఆర్ధిక మంత్రి ఆఖరి ప్రయత్నం
1984 నుంచి ఇప్పటి వరకు మధ్యలో 1999 ఎన్నికల్లో మినహా అన్నిసార్లు చిదంబరాన్ని ఆదరించారు శివగంగ ఓటర్లు. అయితే చిదంబరం సొంత ఇమేజ్ కన్నా పొత్తులు ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాయన్నది వాస్తవం. 2009 ఎన్నికల్లో ఆయన అతికష్టమ్మీద విజయం సాధించారు. ఆ ఎన్నికల వివాదం ఇంకా కోర్టులో నలుగుతోంది. ఈసారి ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.
అంతే కాదు. ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్ అంటరాని పార్టీ అయిపోయింది. అటు డీఎంకె, ఇటు అన్నా డీఎంకే కాంగ్రెస్‌ను దూరంగా పెట్టాయి. బిజెపి చిన్న చిన్న పార్టీలను చేరదీసి కూటమిని ఏర్పాటు చేసుకుని, మూడో శక్తికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఆ పనీ చేయలేకపోయింది. దీంతో ఈసారి తమిళనాడులో కాంగ్రెస్‌ది ఒంటరి పోరు. దీంతో అసలు పార్టీ పరిస్థితే అంతంత మాత్రం. ఇక చిదంబరం పరిస్థితి చెప్పనక్కర్లేదు.
తొలిపోరులో తనయుడు
చిదంబరం కొడుకుగా తప్ప తమిళనాడులో కార్తీకి అంతగా పాపులారిటీ లేదు. దానికి తోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్దగా కేడర్ లేకపోవడం కార్తీ కష్టాల్ని రెట్టింపు చేస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, ఆప్ సహ 26 మంది అభ్యర్థుల్ని కార్తీ తన తొలి రాజకీయ పోరాటంలో ఎదుర్కొంటున్నారు.
చెన్నైకి దాదాపు 450 మైళ్ల దూరంలో ఉండే శివగంగలో కుటీరపరిశ్రమలు, వ్యాపారాలు, బ్యాంకింగ్ కి ప్రసిద్ధి. అలనాడు అటు బర్మా నుంచి ఇటు జపాన్ దాకా వ్యాపారాలు చేసిన నాట్టుకోట్టై చెట్టియార్లకు ఈ నియోజకవర్గం పేరెన్నిక గన్నది. చిదంబరం కూడా అదే వర్గానికి చెందిన నాయకుడు. ఆయన అనేక సంవత్సరాల రాజకీయ జీవితంలో నియోజకవర్గమంతా బ్యాంకులు, ఏ టీ ఎంలు పెట్టించారు. కానీ ఏటీఎంలు, బ్యాంకులు డబ్బులైతే ఇస్తాయి కానీ ఓట్లు కురిపించవు కదా!