
12 నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ ప్రచారం
జై సమైక్యాంధ్ర పార్టీ ఈనెల 12 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సబ్బం హరి తెలిపారు.
విశాఖపట్నం: జై సమైక్యాంధ్ర పార్టీ ఈనెల 12 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సబ్బం హరి తెలిపారు. గురువారం విశాఖపట్నం సీతమ్మధారలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రచార వ్యవస్థను తొలిసారిగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. సీపీఎంతో కలసి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
తమ పార్టీ తెలంగాణలో 35, సీమాంధ్రలో 175 స్థానాల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని వెల్లడించారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఇస్తున్న హామీలకయ్యే ఖర్చు వార్షిక బడ్జెట్‌పై ఏవిధంగా భారంకానుందనే విషయాన్ని పట్టిక రూపంలో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. తమ పార్టీ తరఫున విశాఖ, విజయనగరం లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయాల్సి వస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పారు.