'పవర్లోకి వస్తే ఆ ప్రాజెక్ట్లకు జాతీయహోదా'
ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే నన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదేనని జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరాం రమేష్ ఇవాళ ఆదిలాబాద్, శుక్రవారం ఖమ్మం, నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. అంతకు ముందు ఆయన టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోలోని అంశాలు, తదితర విషయలపై వారు చర్చిస్తునట్లు సమాచారం