వైఎస్సార్‌సీపీలో చేర్చుకుని, సీటు ఇవ్వలేదనే ఆక్రోశంతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జేసీ దివాకర్‌రెడ్డి పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్‌సీపీలో చేర్చుకుని, సీటు ఇవ్వలేదనే ఆక్రోశంతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జేసీ దివాకర్‌రెడ్డి పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఒకవేళ సీటు ఇచ్చి ఉంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేవాడివా? అని ప్రశ్నించారు.
శనివారం అనంతపురం జిల్లా యాడికిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జేసీ దివాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు పాలనలో 1995 నుంచి 2003 వరకూ జిల్లాలో అరాచకం రాజ్యమేలింది. వందలాది మంది అమాయకులను టీడీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాసనసభలో జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన మరచిపోయి ఉండవచ్చు గాక ప్రజలు మరచిపోయారనుకుంటే పొరపాటు’ అని దెప్పిపొడిచారు. అరాచక చక్రవర్తి.. హత్య రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు అంటూ శాసనసభలో శివాలెత్తిన విషయం మరచిపోయావా.. లేదంటే మరచిపోయినట్లు నటిస్తున్నావా అంటూ జేసీని నిలదీశారు.
అప్పుడు అరాచక చక్రవర్తి అయిన చంద్రబాబులో ఇప్పుడు అభివృద్ధికారకుడుగా కన్పిస్తున్నాడా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీలో చేర్చుకుని జేసీకి టికెట్ ఇస్తోండటం వల్లే చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. చంద్రబాబు సమర్థుడు అంటోన్న జేసీ.. ఆయన ఏ విధంగా సమర్థుడో ప్రజలకు చెబితే బాగుంటుదన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న తాడిపత్రి నియోజకవర్గంలో పెండేకల్లు రిజర్వాయర్‌కు మర్రిచెన్నారెడ్డి 1990లో శంకుస్థాపన చేస్తే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ప్రాజెక్టును చేపట్టిన దాఖాలు లేవన్నారు.
యాడికి హెడ్ రెగ్యులేటర్, చాగల్లు రిజర్వాయర్‌లను చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే పెండేకల్లు, చాగల్లు రిజర్వాయర్‌తో పాటు యాడికి కాలువ పనులను పూర్తిచేశారని వివరించారు. అనంతపురం జిల్లాలో వందలాది మంది నేతలను హత్యలు చేసేలా ప్రోత్సహించిన చంద్రబాబులో సమర్థుడు కన్పించడం జేసీ అవివేకతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును జేసీ దివాకర్‌రెడ్డి చదువుతున్నారే తప్ప.. ఆ విమర్శల్లో వీసమెత్తు వాస్తవం కూడా లేదన్నది ఆయనకూ తెలుసన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి తీరు మారకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.