తెలంగాణ తొలి సీఎం కేసీఆరే: కేకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. పార్టీలో మెజారిటీ నేతలు ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇక పార్లమెంట్ సీట్లలోనూ అత్యధిక స్థానాలు గెలుస్తామని, కేంద్రంలో కీలక పాత్ర వహిస్తామని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల కిందటే ఢిల్లీ వచ్చిన కేకే.. సోమవారం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. పార్టీ మెనిఫెస్టోలో పేర్కొన్నట్లు విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలతో పాటు నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో రాజీ పడకుండా అభివృధ్ధి ఫలాలు అందరికీ అందేలా చూస్తామన్నారు.
అన్నింటికన్నా ముఖ్యంగా పోలవరం డిజైన్ మార్చాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తామన్నారు. డిజైన్ మార్చని పక్షంలో ఉద్యమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక కేంద్రంలో లౌకికవాద కూటమికే తమ మద్దతు ఉంటుందని, వారితోనే తమ పార్టీ కలిసి నడుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే మతతత్వ ముద్ర పడిన పార్టీలకు మాత్రం తాము దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా, థర్డ్‌ఫ్రంట్‌లోని కీలక నేతలతో కేకే చర్చలు జరిపినట్టు తెలిసింది. పశ్చిమబెంగాల్‌కూ వెళ్లి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు కమ్యూనిస్టు నేతలతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై కేకేను ప్రశ్నించగా ‘థర్డ్ ఫ్రంట్‌తో చర్చలు జరిపి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.