బాబాయ్ దెబ్బ... అబ్బాయ్ అబ్బా! | Kinjarapu political family war in srikakulam district! | Sakshi
Sakshi News home page

బాబాయ్ దెబ్బ... అబ్బాయ్ అబ్బా!

Published Thu, Apr 17 2014 3:51 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

బాబాయ్ దెబ్బ... అబ్బాయ్ అబ్బా! - Sakshi

బాబాయ్ దెబ్బ... అబ్బాయ్ అబ్బా!

‘రాజకీయాల్లో రాము ఇంకా పసివాడు. తొలిసారి ఎలక్షన్లోకి దిగుతున్నాడు. అటువంటప్పుడు బీజేపీ సీటు వ్యవహారమంతా వాడి నెత్తిన పెట్టేయడమేమిటి?.. అది మాట్లాడటానికి రాము హైదరాబాద్  వెళ్లడమేమిటి?.. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న అచ్చెన్నాయుడు ఇక్కడ ఉండిపోవడమేమిటి?.. అచ్చెన్నే హైదరాబాద్ వెళ్లి బాబుగారితో, వెంకయ్యనాయుడుగారితో మాట్లాడాలి కదా!.. అంటే బీజేపీకి సీటు ఇవ్వకుండా అడ్డుకోలేకపోయాడని రాము మీదకు నింద తోసేయడానికేనా? కుటుంబం కోసం మా ఆయన ఎంతో చేశారు.

ఆయన కేంద్రమంత్రి అయిన తరువాత నన్ను ఎమ్మెల్యేను చేయలేదే. తమ్ముడి మీద అభిమానంతో  అచ్చెన్నాయుడుకే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడేమో అచ్చెన్న కావాలనే రామును ఒంటరిని చేసేస్తున్నాడు‘ ..ఇదీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తల్లి విజయలక్ష్మి రెండ్రోజులుగా సన్నిహితుల వద్ద వెళ్లబోసుకుంటున్న ఆవేదన. కింజరాపు కుటుంబంలో చాపకింద నీరులా పాకుతున్న విభేదాలకు ఇది సంకేతం.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బీజేపీతో పొత్తు వ్యవహారం జిల్లా టీడీపీలోనే కాదు.. కింజరాపు కుటుంబంలోనూ చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి ఏ అసెంబ్లీ సీటు ఇచ్చినా టీడీపీ దారుణంగా నష్టపోతుందని స్పష్టమైంది. అందుకే మొదట నరసన్నపేట సీటును బీజేపీకి కేటాయించగానే టీడీపీ శ్రేణులతోపాటు కింజరాపు కుటుంబం హడలిపోయింది. దాంతో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీకి నరసన్నపేట ఇవ్వకూడదని ఆ కుటుంబంతోపాటు నరసన్నపేట టీడీపీ నేతలు పట్టుబట్టారు. దీనిపై చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన అచ్చెన్నాయుడు నేరుగా అధినేతతో మాట్లాడే బాధ్యతను మాత్రం తీసుకోకుండా రామ్మోహన్ మీదకే నెట్టివేశారు.

ఆయన ఎలాగోలా కష్టపడి నరసన్నపేటను తిరిగి టీడీపీయే పోటీచేసేలా ఒప్పించారు. కానీ నరసన్నపేట స్థానంలో బీజేపీకి ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని కేటాయించడంతో టీడీపీ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. కాళింగ సామాజికవర్గానికి టీడీపీ అన్యాయం చేసిందన్న వాదన బలంగా వినిపించింది. దాంతో మళ్లీ చంద్రబాబుతోనూ బీజేపీ నేతలతోనూ మాట్లాడాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు వ్యూహాత్మకంగా తప్పుకున్నారు.

కాళింగుల ఆగ్రహాన్ని రాముపైకి మళ్లించేందుకేనా!


బీజేపీకి ఇచ్చాఫురం సీటు కూడా ఇవ్వకుండా చంద్రబాబును ఒప్పించే బాధ్యతను కూడా అచ్చెన్న తీసుకోలేదు.  పూర్తిగా రామ్మోహన్‌కే వదిలేశారు. ఎందుకంటే బీజేపీకి కేటాయించిన ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని మళ్లీ టీడీపీకి దక్కేలా చేయడం సాధ్యం కాదని అచ్చెన్నకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో తాను జోక్యం చేసుకున్నా ఫలితం ఉండదని గ్రహించారు. కానీ ఈ విషయంలో తాను కల్పించుకుని విఫలమైతే కాళింగ సామాజికవర్గం ఆగ్రహాన్ని నేరుగా చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే కాళింగులు అత్యధికంగా ఉన్న టెక్కలి నియోజకవర్గంలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఇక ఇచ్ఛాపురం సీటును బెందాళం కుటుంబానికి ఇప్పించలేకపోతే ఆ సామాజికవర్గం ఆగ్రహం మరింతగా కట్టలు తెంచుకుంటుంది. దాంతో ఎన్నికలకు ముందే టెక్కలిలో తన ఓటమి ఖాయమైపోతుందని అచ్చెన్నకు తెలిసివచ్చింది. అందుకే కాళింగుల ఆగ్రహాన్ని రామ్మోహన్ మీదకు నెట్టేసి తాను తప్పించుకునే ఎత్తుగడ వేసినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

అచ్చెన్న తీరుపై విజయలక్ష్మి ఆవేదన


అచ్చెన్న వ్యూహం బయటపడటంతో దివంగత ఎర్రన్నాయుడి సతీమణి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన చెందినట్లు సమాచారం. ప్రధానంగా శ్రీకాకుళంలో తమ నివాసంపై ఇచ్ఛాఫురం కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.  ఎర్రన్నాయుడు సన్నిహితుల వద్ద ఆమె ఇదే ఆవేదన వెళ్లగక్కినట్లు సమాచారం. రెండురోజుల క్రితం తమ సన్నిహితులతో మాట్లాడుతూ  ‘ఈ ఇంటికి రావడాన్ని పార్టీ కార్యకర్తలు ఎంతో గౌరవంగా భావించేవారు.

కానీ వారే ఇప్పుడు ఇంటిపై దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అచ్చెన్నాయుడు మాత్రం బయటకు రాలేదు. ఇక శ్రీకాకుళం ఎంపీ సీటు గెలుచుకోవడానికి ఏం చేయాలన్నది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బీజేపీకి సీటు ఇస్తే బాబు ఎలా గెలుస్తాడు? కానీ బీజేపీకి సీటు ఇవ్వొద్దు అని చంద్రబాబుగారిని ఒప్పించడానికి రాము వెళ్లాలా? అప్పుడే అంత పెద్ద వ్యవహారాలు చక్కబెట్టడం వాడికి రాదు కదా! అచ్చెన్నాయుడే హైదరాబాద్ వెళితే బాగుండేది.

శివాజీగారిని కూడా వెంట తీసుకువెళ్లాల్సింది. కానీ రాము ఒక్కడినే పంపించారు. తన నామినేషన్ పనులు చూసుకోకుండా వాడు హైదరాబాద్‌లో ఆ గడపా ఈ గడపా ఎక్కి దిగుతున్నాడు. వీళ్లందరి కోసం నాయుడుగారు ఉన్నన్నాళ్లూ ఎంతో తపించారు. కానీ వారు మాత్రం ఆయన కొడుకును పట్టించుకోవడం లేదు. ఏం చేస్తాం? ఎవరికి చెప్పుకుంటాం?... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది’ అని బాధను వెళ్లగక్కారు. ఈ పరిణామాలు కింజరాపు కుటుంబంలో రగులుతున్న అంతర్గత పోరును బహిర్గతం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అసంతృప్తి టీడీపీ విజయకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement