నామినేషన్ వేయకుండా పారిపోయిన కిరణ్
- కుట్రలకు ఆద్యుడు కిరణ్
- బాబు హామీలను ప్రజలు నమ్మరు
- సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ 145 స్థానాల్లో విజయం సాధిస్తుంది
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పీలేరు, న్యూస్‌లైన్: ఓటమి భయంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ వేయకుండా పారిపోయారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ పీలేరు అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైఎస్సార్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంలో కిరణ్ ఉన్నత పదవులు అనుభవించారన్నారు. మహానేత మరణం తర్వాత ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
ప్రజా క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే ధైర్యంలేక సీబీఐతో కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించడంలో కిరణ్ కుట్రదారుడని మండిపడ్డారు. అధికార దాహంతో వెన్నుపోటుదారుడు చంద్రబాబుతో కలసి సీబీఐ ద్వారా అక్రమకేసులు పెట్టించి పదహారు నెలలు జైల్లో పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటి కూడా కట్టించలేదన్నారు.
అభివృద్ధి పేరుతో కిరణ్, ఆయన సోదరులు రాష్ర్ట ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు. చిన్నచిన్న ఉద్యోగాలను సైతం అమ్ముకోవడం నల్లారి సోదరుల దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కుట్రలు పన్నడంలో కిరణ్ ఆరితేరిన వ్యక్తని మండిపడ్డారు. సమైక్య ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనకు సహకరించిన చంద్రబాబు, బీజేపీ నేతలు చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు.
అన్ని సందర్భాల్లో ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. మూడేళ్ల కిరణ్ పాలనలో ప్రభుత్వ భూములన్నింటినీ ఆక్రమించి పెద్దపెద్ద భవంతులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామన్నారు.
ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలని కూల్చివేస్తామని హెచ్చరించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని, తాము ఆరు శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. సీమాంధ్రలో 135 నుంచి 145 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. మాజీ సీఎంల నియోజక వర్గాల్లో సైతం వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు.
ఈ ఎన్నికలతో నల్లారి సోదరుల రాజకీయ జీవితం ముగిసిపోతుందన్నారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.9 లక్షల కోట్లు అవసరమని, ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన తర్వాత సీమాంధ్ర ఆదాయం రూ. 50 వేల కోట్లలోపేనని, ఇలాంటి పరిస్థితుల్లో లక్షల కోట్లు ఎక్కడ తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి, కొత్త హామీలతో ప్రజల వద్దకు రావడం చంద్రబాబుకు కొత్తకాదని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జీజేపీ, జేఎస్పీ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కిరణ్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఓటర్లు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఏ ఇబ్బంది వచ్చినా అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీలు డాక్టర్ వెంకట్రామయ్య, ఎం వెంకటరమణారెడ్డి ,రిటెర్డ్ డీఎస్‌పీ సూర్యనారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ నారే వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులు బీడీ నారాయణరెడ్డి, ఎం. రెడ్డిబాషా, కడప గిరిధర్‌రెడ్డి, డీ జగన్‌మోహన్‌రెడ్డి, షామియానా షఫీ, వివేకానందరెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, ఎం భానుప్రకాష్‌రెడ్డి, నాగిరెడ్డి, ఎం కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎస్ హబీబ్ బాషా, నారే అశోక్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, బాబ్జీరెడ్డి కాకులారంపల్లె రమేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, వై సురేష్‌కుమార్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.