నంద్యాల, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ నాయకులు బరితెగించారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుని హోదాలో ఉన్న పీపీనాగిరెడ్డి తన సమీప బంధువు గోస్పాడు జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి జగదీశ్వరమ్మను గెలిపించుకోవడానికి నానా యాతన పడ్డారు. జనరల్ ఏజెంట్‌గా మండలంలో తిరిగేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
ఇందుకు ఎన్నికల అధికారి సుధాకర్ కూడా అనుమతి ఇచ్చారు. అయితే పీపీపై కొన్ని కేసులు ఉన్నాయని, ఆయనను జనరల్ ఏజెంట్‌గా నియమించవద్దని పోలీసు అధికారులు స్థానిక ఎన్నికల అధికారులకు ఆదేశించారు. అయినా సుధాకర్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. దీంతో పీపీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఆదివారం గన్‌మెన్‌తో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
గోస్పాడు మండలానికి చెందిన ఇతర పార్టీల నాయకులు జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సుధాకర్ జోక్యం చేసుకొని జనరల్ ఏజెంట్‌ను రద్దు చేసి ఆయన సమీపం బంధువు మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డిని నియమించారు. అంతేగాక పీపీని కూడా పోలింగ్ ముగిసే వరకు దీబగుంట్లలో స్వగృహం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
కొత్తపల్లె పోలింగ్ బూత్‌లో డమ్మీ బ్యాలెట్లు?
కొత్తపల్లెలో టీడీపీ నాయకులు గెలుపు కోసం వ్యూహాత్మకంగా తెగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనే అనుమానించిన ఓటర్లకు ప్రచారంలో ఇచ్చిన డమ్మీ బ్యాలెట్ పేపర్‌ను పోలింగ్ బూత్‌లో వేసి ఒరిజనల్ బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చి స్థానిక నాయకునికి ఇచ్చారని వైఎస్సార్సీపీ నాయకులు తాడి నరేంద్రకుమార్‌రెడ్డి, తదితరులు విలేకరులతో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం పరిశీలించాలని కోరారు.
కానాలలో హల్‌చల్...
కానాల మేజర్ పంచాయతీలో కొందరు పోలీసు అధికారులు అండదండలతో దేశం నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్‌రెడ్డి హల్‌చల్ సృష్టించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసిన విజయశేఖర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడి గెలుపొందాలని చేసిన ప్రయత్నాలను వైఎస్సార్సీపీ వర్గాలు అడ్డుకున్నాయి.
విజయశేఖర్‌రెడ్డి పోలింగ్ కేంద్రం ఆవరణంలో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతండటంతో వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ నరేంద్రకుమార్‌రెడ్డి అడ్డుచెప్పారు. అయితే విజయశేఖర్‌రెడ్డికి పోలీసులు అండగా నిలువడంతో నరేంద్ర పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం నేతల బరితెగింపు
Published Mon, Apr 7 2014 12:14 AM | Last Updated on Tue, Aug 14 2018 7:55 PM
Advertisement
Advertisement