సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఒక్క ఓటు అటు ఇటైతే.. గెలుపోటములు తారుమారవుతాయి. అందుకే బ్యాలెట్ బాక్స్‌ల్లో పడే.. ప్రతి ఓటును తమ ఖాతాలో జమ చేసుకునేందుకు అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. పోలింగ్ ముగిశాక విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆఖరి ప్రయత్నంగా పోస్టల్ బ్యాలెట్లపై దృష్టి సారించారు. హోరాహోరీ పోరులో ఈ ఓట్లు సైతం తమకు కలిసొస్తాయని ఛాలెంజ్‌గా స్వీకరిస్తున్నారు. కౌంటింగ్ ముందు రోజు మే 15 సాయంత్రం వరకు వీటిని దాఖలు చేసే అవకాశముంది. గత నెలాఖరు
వరకు వీటిని దరఖాస్తు చేసుకున్న పోలింగ్ ఉద్యోగులు, సిబ్బందికి ఈ ఓటు వర్తిస్తుంది. జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13,028 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 10,157 మందికి ఇప్పటికే ఎన్నికల యంత్రాంగం బ్యాలెట్ పత్రాలను జారీ చేసింది. కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో వీటి సంఖ్య వెయ్యి దాటింది. అత్యధికంగా కరీంనగర్‌లో 3,638 మంది, అత్యల్పంగా ధర్మపురిలో 375 మంది పోలింగ్ సిబ్బంది వీటికి దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారనున్నాయి. అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉన్నప్పుడు ఈ ఓట్లే జయాపజయాలను నిర్ణయిస్తాయనటంలో సందేహం లేదు. కౌంటింగ్ రోజున మొట్టమొదటగా రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్‌పై ఈ ఓట్లను లెక్కిస్తారు. అందుకే ఎలాగైనా వీటిని సొంతం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు పేరుపేరునా పోలింగ్ సిబ్బంది ఫోన్ నెంబర్లు సేకరించి.. ఫోన్‌లోనే ఓట్లు అభ్యర్థించే పని పెట్టుకున్నారు. కొందరు నాయకులు ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వారిని అభ్యర్థించి.. రకరకాల మార్గాల్లో వారిని ఆకట్టుకొని తమకు అనుకూలంగా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
కొందరు అభ్యర్థులు గంపగుత్తగా తమ ఓట్లు వేయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఆశ్రయిస్తున్నారు. రామగుండం, కోరుట్ల నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. ఈ రెండు సెగ్మెంట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులే పోస్టల్ బ్యాలెట్ల సేకరణలోనూ పోటీ పడుతున్నారు. క్రాస్ ఓటింగ్ ఎవరిని గెలిపిస్తుందోనని అందోళనలో ఉన్న ఎంపీ అభ్యర్థులు వీటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో 2431 మంది తమ ఓట్లు దాఖలు చేశారు. మరో 13 రోజులు గడువు ఉండటంతో అభ్యర్థులు వీటికి గురి పెట్టిన తీరు ఆసక్తి రేపుతోంది.
ఆఖరి మోఖా
Published Sat, May 3 2014 2:32 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
Advertisement