అవినీతిపై చర్యలు చేపట్టాం
కేరళ ప్రచారంలో మన్మోహన్
నేటికీ మారకుంటే ‘లెఫ్ట్’ బలం తగ్గుతుందని చురకలు
కొచ్చి: బీజేపీ విభజన రాజకీయాల సిద్ధాంతాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీయే సమర్థంగా తిప్పికొట్టగలదని ప్రధాని మన్మోహన్‌సింగ్ ఉద్ఘాటించారు. యూపీఏ పదేళ్ల పాలనలో దేశాభివృద్ధి కుంటుపడిందని, అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంలో తాము విఫలమయ్యామన్న బీజేపీ ఆరోపణలను తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు. అలాగే ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకిస్తున్న వామపక్ష పార్టీలకూ చురకలంటించారు. కాలానుగుణంగా మారకపోతే భవిష్యత్తులో ఆ పార్టీల బలం మరింత పడిపోతుందని జోస్యం చెప్పారు.
ఆదివారం కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న తొప్పుంపాడిలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు సహకరించకపోవడం వల్లే అవినీతిని అరికట్టేందుకు మరిన్ని చట్టాలు తేవాలనుకున్న తమ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. అవినీతిని అరికట్టేందుకు గత ప్రభుత్వాలకన్నా తామే ఎక్కువ చర్యలు చేపట్టామని..ముఖ్యంగా లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చామని గుర్తుచేశారు. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించామని...సంక్షేమ ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూశామన్నారు.
గత పదేళ్లలో కేరళలో కొచ్చి మెట్రోరైల్, కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ వంటి ప్రాజెక్టులకు సుమారు రూ. 70 వేల కోట్ల కేంద్ర నిధులను పెట్టుబడులుగా పెట్టామన్నారు. అందుకే కేరళ దేశ సగటుకన్నా ఎక్కువ అభివృద్ధి రేటును సాధించిందని తెలి పారు. వామపక్షాలు నేటికీ మారకపోవడం వల్లే 2009 ఎన్నికల్లో ఆ పార్టీలు భారీ నష్టాన్ని చవిచూశాయని...కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యాయని మన్మోహన్ పేర్కొన్నారు.