
లోక్‌సత్తా నీతులు చెబితే సరిపోదు: నాగేశ్వర్
సిటీబ్యూరో: పరిపాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, వారసత్వ రాజకీయాలపై నిత్యం నీతులు చెప్పే లోక్‌సత్తా పార్టీ కూడా ఇతర పార్టీల జాబితాలో చేరిపోయిందని మల్కాజిగిరి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎద్దేవా చేశారు. ప్రజలకు నీతులు చెప్పడం కాదని, తాము కూడా వాటిని పాటించాలన్నారు. ఆదివారం ఆయన ఆల్వాల్, బాలానగర్, మలేషియా టౌన్‌షిప్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీతి, న్యాయం అని చెప్పే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఇప్పుడు తనపై, తన పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారని నాగేశ్వర్ ప్రశ్నించారు. స్ట్రింగ్ ఆపరేషన్‌లో చిక్కిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో సరిపోదన్నారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోలు అద్భుతంగా ఉన్నాయని జేపీ చెబుతున్నారని, ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆ పార్టీలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారనేందుకు ఇదో నిదర్శనమన్నారు. ఆదర్శవంతమైన కేజ్రీవాల్‌ను వదిలేసి మతోన్మాదిగా ముద్రపడిన నరేంద్రమోడీని భుజానికి ఎత్తుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటో వివరించాలన్నారు. సుమారు ఆరువేల మంది నివసిస్తున్న మలేషియా టౌన్‌షిప్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, గత పాలకులు దీని అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని నాగేశ్వర్ ఆరోపించారు. బాలాన గర్ శ్రీనగర్ కాలనీలోని ప్రజలు గుక్కెడు నీళ్లకూ నోచుకోవడం లేదని, ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల కనీస అవసరాలు తీరుస్తానని హామీ ఇచ్చారు.