ఎమ్మెల్యేలు ఇక మాజీలు | legislators are become former before the creation of the telangana state government | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు ఇక మాజీలు

Published Sat, Apr 26 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

ఎమ్మెల్యేలు  ఇక మాజీలు

ఎమ్మెల్యేలు ఇక మాజీలు

 అసెంబ్లీ రద్దుతో..

  •      కొత్త సర్కారుకు ముందే..
  •      జిల్లాలో తొమ్మిది మంది
  •      సర్కారు ఏర్పడే వరకు రాష్ట్రపతి పాలనే
  •      శాసనమండలి సభ్యులు సేఫ్

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పాటుకు ముందే శాసనసభ్యులు మాజీలయ్యారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇక మాజీలుగానే ప్రచారం నిర్వహించుకోవాల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు రాష్ట్రపతి పాలన విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రులు, విప్‌లు మాజీలు కాగా.. ఎమ్మెల్యే పదవులు మాత్రం సుప్తచేతనావస్థలో ఉన్నాయి. శుక్రవారం అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్, రాష్ట్రపతి పాలనను పొడిగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మాజీలైపోయారు. దీంతో జిల్లాలో పాలనపగ్గాలు పూర్తిగా అధికారుల చేతులకు మారనున్నాయి. అధికారికంగా పాల నా వ్యవహారాలు ఇదివరకు కూడా జిల్లా కలెక్టరే చూస్తున్నా.. ఇకపై పాల నా వ్యవహారాల్లో మరింత కీలకపాత్ర పోషించనున్నారు. ఇప్పటికే మంత్రిగా పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, విప్‌గా ఈరవత్రి అనిల్‌లు ‘మాజీ’లు కాగా... ఎమ్మెల్యే పదవులు సుప్తచేతనావస్థలో ఉన్నాయి. కేంద్ర కేబినేట్ తాజా నిర్ణయంతో సుప్తచేతనావస్థలో ఉన్న ఎమ్మెల్యే పదవులు రద్దు అయ్యాయి.

1973 అనంతరం రాష్ట్రపతి పాలన రావడం ఇదే మొదటిసారి కాగా... పోలింగ్ ముగిసి, కొత్త సర్కారు ఏర్పడక ముందే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కావడం చర్చనీయాంశం అవుతోంది. జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్న పి.సుదర్శన్‌రెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, ఈరవత్రి అనిల్, ఏలేటి అన్నపూర్ణమ్మ, ఏనుగు రవీందర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణలు శనివారం నుంచి మాజీ ఎమ్మెల్యేలు కానున్నారు. మండవ వెంకటేశ్వర్‌రావు, అన్నపూర్ణమ్మలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోగా.. యెండల లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. యెండలతో పాటు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండగా, వారు నేటి నుంచి మాజీ ఎమ్మెల్యేలుగా ప్రజల్లోకి ప్రచారం కోసం వెళ్లాల్సిన పరిస్థితి. అయితే శాసనమండలి సభ్యుల పదవులు మాత్రం సేఫ్‌గా ఉండనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement