ఓటున్న నవాబులు... కూటికి లేని గరీబులు
శ్రీకాకుళం, శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మైనార్టీలుగా పేరుపొందిన ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా అచ్చంగా మైనార్టీల్లానే కనిపిస్తారు. ఎక్కడో తప్ప ఈ వర్గంలోని అత్యధిక శాతం ప్రజలు పేదవర్గాలకు చెందిన వారే. అయితే వీరి సంఖ్య అధికంగా ఉన్న చోట్ల ఎన్నికల్లో వీరి ఓట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దీన్ని గుర్తించిన పార్టీలు ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో ఓట్లు కొల్లగొట్టి.. ఆనక వారికి విస్మరిస్తున్నాయి. అరకొర పథకాలతో ముస్లింలకు ఆర్థిక ఎదుగుదల లేకుండా చేస్తున్నాయి. జిల్లాలోని పరిస్థితినే పరిశీలిస్తే.. ఇక్కడ ముస్లిం జనాభా సుమారు 25 వేల వరకు ఉంటుంది. వీరిలో 12,600 మంది ఓటర్లుగా ఉన్నారు. ప్రధానంగా శ్రీకాకుళం పట్టణంలో సుమారు 600 కుంటుంబాలు ఉన్నాయి.
అలాగే గార మండలంలో కళింగపట్నం, శ్రీకూర్మం, సతివాడ తదితర గ్రామాల్లోనూ, రణస్థలం, ఇచ్ఛాపురం, మందస, హిరమండలం, నరసన్నపేట, కోటబొమ్మాళి, ఎల్.ఎన్.పేట, జి.సిగడాం మండలాలతోపాటు ఆమదాలవలస మున్సిపాలిటీలో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వీరి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నానాపాట్లు పడుతుంటాయి. వారి సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తున్నాయి. ముస్లిం జనాభాలో 90 శాతం వరకు చిన్న, చిన్న వ్యాపారాలు, కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారే. ఓ రోజు వ్యాపారం నడవకపోయినా, కూలి పని లేకపోయినా ఆ పూట గడవని పరిస్థితి వారిది.
చాలామంది రాళ్లు కొట్టుకొని జీవిస్తున్నారు. కాగా వాహన బ్యాటరీల రిపేర్లు, టైర్ల రిపేర్లు, పాత వాహనాల విడిభాగాల అమ్మకం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారే అధికం. కొందరు మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి వారు తమ పిల్లలను పెద్దగా చదివించలేని స్థితిలో ఉండేవారు. అందువల్లే వారి పిల్లలు సైతం తల్లిదండ్రుల వృత్తులనే వారసత్వం స్వీకరిస్తూ బతుకుబండి లాగిస్తుంటారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి దశాబ్దం క్రితం వరకు అధికారం చెలాయించిన పార్టీలు చేసింది దాదాపు శూన్యమే. అరకొర నిధులు, అక్కరకు రాని పథకాలతో ముస్లింలను మభ్యపెట్టేవారు. ఫలితంగా ఈ వర్గంవారు ఆర్థికంగా ఎదగడం అసాధ్యంగా ఉండేది.
మహానేత రాకతో..
అటువంటి సమయంలో 2004లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింల వెనుబాటుతనంపై పోరాటం ప్రారంభించారు. సంక్షేమ పథకాలతో వార జీవితాల్లో వెలుగు నింపారు. ముఖ్యంగా సచార్ కమిటీ నివేదిక బూజు దులిపి ముస్లింల ఎదుగదలకు రిజర్వేషన్లే మార్గమని నిర్ణయించి వారికి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు.
ఫలితంగా కీలకమైన విద్య, ఉద్యోగ రంగాల్లో వారికి న్యాయమైన వాటా లభించింది. ముస్లిం పిల్లలు విద్యావంతులయ్యారు. యువత ఉద్యోగ భద్రత పొందారు. ఇవి కాకుండా ఫీజు రీయంబర్స్‌మెంట్, మైనార్టీలకు స్వయం ఉపాధికి రుణాలు, పేదలకు తెల్లకార్డులు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు ముస్లిం జీవన విధానంలో పెనుమార్పులు తీసుకొచ్చాయి. ఒకప్పుడు జిల్లాలో ముస్లింలలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే అదో పెద్ద వింతగా ఉండేది.
రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు కల్పించిన తరువాత ఇటీవల కాలంలో 20 మంది వరకు ఉపాధ్యాయులుగా, 10 మందికి పైగా కానిస్టేబుళ్లుగా, 7 వీఆర్వోలుగా, నలుగురు కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగులుగా, గ్రూప్-4 ఉద్యోగులుగా ఎంపికై జీవితాల్లో స్థిరపడ్డారు.కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సాయంతో 25 మంది వరకు వైద్య విద్య చేయగా.. వందలాది మంది ఇంజినీరింగ్, పీజీ, ఇతర ఉన్నత కోర్సులు చేస్తున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఎం.ఎ.రఫీ రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పని చేశారు. అయితే వైఎస్ అనంతరం ప్రభుత్వాలు మళ్లీ చిన్నచూపు చూడటంతో వీరి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు రాక చాలా మంది చదువులు మధ్యలో మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్వయం ఉపాధి రుణాల మంజూరు నిలిచిపోయింది. దాంతో ప్రస్తుతం ముస్లింలు నేలచూపులు చూస్తున్నారు. ఆదుకొనే నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల రూపంలో వారికి ఆ అవకాశం వచ్చింది. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపే నవతరం నాయకత్వాన్ని ఎన్నుకొనే మహత్తర ఆవకాశం వారి చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తించాలి.