శంకరపట్నం, న్యూస్‌లైన్ : మండలంలోని మొలంగూర్‌లో శనివారం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతుండగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. జెడ్పీటీసీ అభ్యిర్థి బత్తిని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఉద్యమం చేసింది తప్పితే , తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
అభివృద్ధి చేశాం కాబట్టి తమకే ఓటు అడిగే హక్కు ఉంది అని ప్రసంగిస్తుండగా నలుగురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. గొడవ చేయొ ద్దంటూ పొన్నం సైగలు చేయగా వారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పొన్నం కల్పించుకుని తాము ఒక్క నిమిషం తల్చుకుంటే ఇక్కడ ఉండలేరని గాంధేయవాదంతో ప్రచారం చేస్తున్నామన్నారు. గొడవలకు దారి తీసే పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారంటూ విమర్శించారు.