ఇటు ధీమా అటు డైలమా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో దాదా పు అన్ని చోట్లా ముఖాముఖీ పోరుకు తెరలేచింది. గత పాలకవర్గంలో చైర్‌పర్సన్ స్థానం బీసీ జనరల్‌కి రిజర్వు కాగా ఈసారి జనరల్ అయింది. తొలి విడత పోలింగ్ 26 జెడ్పీటీసీలలో జరగ్గా ఫలితాలపై ఎవరి అంచనాల్లో వారున్నారు. ఈ నెల 11న 31 మండలాల్లో జరిగే మలి విడత పోరుకు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇంతవరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 57 సీట్లలో ఏ ఒక్క చోటా నామమాత్ర పోటీ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
దీంతో పోటీ వైఎస్సార్‌సీపీటీడీపీ మధ్యనే నెలకొంది. ఈ నెల 6న జరిగిన తొలి విడత ఎన్నికల్లో మూడింట రెండు వంతులకుపైబడి మెజార్టీ స్థానాలు సాధిస్తామనే ధీమా వైఎస్సార్ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఇదే ఊపుతో రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలపైనా ఆ పార్టీ నేతలు దృష్టిపెట్టారు.ఈ పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు, ఇర్రిపాక మాజీ సర్పంచ్ నవీన్‌ను ఎంపిక చేయగా, ఆయన అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీమంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చెల్లుబోయిన వేణు తదితరులు పక్కా ప్రణాళికతో నవీన్‌ను బరిలోకి దింపారు.
ఆయన ఎంపిక మొదలు జెడ్పీటీసీ అభ్యర్థులను బరిలోకి దింపే వరకు ఆచితూచి అనుసరించిన వ్యూహం కలసి వస్తోందన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. తెలుగుదేశంపార్టీ మలివిడత పోలింగ్‌కు చేరువైనా కూడా చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. ఇందుకు నెగ్గుకురాగలిగే వారి కోసం వెతుకులాడినా ఫలితం లేకపోయింది. ఫలితంగా ఎన్నికల తరువాత చూసుకుందామని జిల్లా నాయకత్వం భావించింది. దీంతో చైర్మన్ అభ్యర్థి ఎంపిక కాకుండానే బరిలో దిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది మొదలు రాజకీయంగా, సామాజికంగా అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకపోవడమే వైఎస్సార్ సీపీ సానుకూల పరిస్థితికి దోహదం చేసిందని నేతలు విశ్లేషిస్తున్నారు.
పార్టీ ముఖ్యనేతలందరూ తమ పరిధిలోని జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించడమే కాకుండా ప్రచారంలో ముందుండడం, ఎంపీటీసీ అభ్యర్థులతో సమన్వ యం కొనసాగించడం సత్ఫలితాలను ఇస్తోందని భావిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించే చైర్‌పర్సన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడంతో అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వాతావరణం నెలకొందని అంటున్నారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థుల కు మద్దతుగా వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మంగళవారం అడ్డతీగలలో పార్టీ యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ భారీ ర్యాలీ నిర్వహించగా, కాజులూరులో పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అమలాపురంలో పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి జ్యోతుల నవీన్ కూడా ప్రచారాల్లో పాల్గొన్నారు.
టీడీపీలో గందరగోళం
కీలకమైన ప్రచారపర్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అభ్యర్థులు నైరాశ్యంలో ఉన్నారు. ఆ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు నాయకత్వానికి తలపోటుగా మారింది. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల సమన్వయపరిచే నాయకత్వం కొరవడడం పార్టీ అభ్యర్థులకు మైనస్‌గా మారిందంటున్నారు. ఈ కారణంగానే తొలి విడత ఎన్నికలు జరిగిన 26 మండలాల్లో చెప్పుకోదగ్గ స్థానాలు వస్తాయనే నమ్మకం టీడీపీ నేతలకు చిక్కడంలేదని ఆంతరంగిక చర్చల్లో తెలుస్తోంది. తొలి విడత ఎన్నికలు జరిగిన అనపర్తి నియోజకవర్గంలో భారీ మెజార్టీని అంచనా వేసిన ఒక జెడ్పీటీసీ విషయంలో ఫలితాలు తారుమారయ్యేలా ఉన్నాయని ఆ పార్టీ నేతలే తాజాగా లెక్కలు వేస్తున్నారు. రెండో విడత ప్రచారం బుధవారం సాయంత్రం ముగియనుంది. రెండో విడత పోలింగ్ జరిగే అమలాపురం, రంపచోడవరం, రామచంద్రపురం డివిజన్లలో 31 జెడ్పీటీసీలు ఉన్నాయి. వీటిలో ఏ పార్టీకి ఎన్ని దక్కనున్నాయనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.