‘పరిషత్’ సమరం..ఉద్రిక్తం | High tension in Kakinada constituency during MPTC,ZPTC polling | Sakshi
Sakshi News home page

‘పరిషత్’ సమరం..ఉద్రిక్తం

Published Mon, Apr 7 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

High tension in Kakinada constituency during MPTC,ZPTC polling

సాక్షి, కాకినాడ :జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఆదివారం పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం డివిజన్ల పరిధిలోని 26 జెడ్పీటీసీ, 513 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 1545 కేంద్రాల్లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలుత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ 11 గంటల నుంచి పుంజుకుంది. తుని, తొండంగి, గండేపల్లి, జగ్గంపేట, పెద్దాపురం, కిర్లంపూడి, కడియం, శంఖవరం, రాజానగరం, కాకినాడ రూరల్, కరప, తాళ్లరేవు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది.
 
 చెలరేగిపోయారిలా..
  తొండంగి మండలం ఎర్రయ్యపేటలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు     - మిగతా 2లోఠ
 ేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు కొద్దిసేపు పోలింగ్ నిలిపివేశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. అర్జిలి అమల, బుజ్జి, ప్రసాద్, కుక్కల లక్ష్మి, గంపల విజయ్‌కుమార్, చొక్కా అమ్మాజీ, గరికిన లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. బుజ్జి తలకు గాయం కాగా, అమలకు దంతాలు విరిగిపోయాయి. ప్రసాద్, లక్ష్మిలకు కాళ్లు, విజయ్‌కుమార్‌కు చేయి విరిగి పోయాయి. గ్రామానికి చెందిన వీడియోగ్రాఫర్ రాజు ఇంట్లో  కంప్యూటర్‌ను ధ్వంసం చేసి సీపీయూ ఎత్తుకెళ్లారు.
 
 ఇళ్లల్లోని ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. దాడులకు పాల్పడినవారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని మండలం ఎన్.సూరవరంలో టీడీపీ కార్యకర్తల దాడిలో వెలగా సత్తిబాబు, రమణ, గంటా వీరబాబు గాయపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీకి పని చేసి ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి పని చేయడమే వారి నేరం. గండేపల్లి మండలం ఎల్లమిల్లిలో ఆటోలపై ఓటర్లను తరలించడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. తెగడా శ్రీనివాస్, తెగడా అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. బొర్రంపాలెం పోలింగ్ బూత్‌పై స్వల్ప వివాదం తలెత్తగా వైఎస్సార్‌సీపీకి చెందిన పల్లపు నరేష్‌ను టీడీపీ కార్యకర్తలు గాయపరిచారు.  
 
  తాళ్లరేవు మండలం గాడిమొగ-1 పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు మల్లాడి భైరవమూర్తిని తన స్థానంలో కూర్చోబెట్టారు. టీడీపీ కార్యకర్తలు నానా దుర్భాషలాడుతూ అతడిని బయటకు లాక్కొచ్చి దాడి చేసి గాయపర్చారు. జి.వేమవరంలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తుండడాన్ని గుర్తించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి నరాల మంగ భర్త కొండ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారిని బయటకు పంపేశారు. ఇంజరం, గోవలంకల్లో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కడియం మండలం జేగురుపాడులో పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారన్న నెపంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు వై.సతీష్‌చంద్రస్టాలిన్‌ను సీఐ ఎన్‌బీఎం మురళీకృష్ణ దుర్భాషలాడారు. దీనిపై ఆగ్రహించిన ఆయన అనుచరులు ధర్నా చేశారు.
 
  జగ్గంపేట మండలం గోవిందపురంలో వికలాంగురాలికి సహాయంగా వచ్చిన వ్యక్తి చెప్పిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి  ఓటు వేశారనే అనుమానంతో పీఓపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డారు. పోలీసులు సర్ది చెప్పి టీడీపీ వారిని అక్కడ నుంచి పంపించివేశారు. మామిడాడకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాకర్ల నాగేశ్వరరావుపై టీడీపీ, కాంగ్రెస్‌కు చెందినవారు ఆదివారం సాయంత్రం జరిపిన దాడిలో చేయి విరిగిపోయింది.  తనపై కర్రి సత్తిబాబు, దొడ్డి బాబులు, బుద్ద శ్రీను, దొడ్డి లచ్చబాబు, బొద్దేటి భుజంగరావు దాడి చేశారని నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దాపురం మండలం ఉలిమేశ్వరంలో ఓటర్లను ప్రలోభ పెట్టడంపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ ప్రకాష్‌కు తీవ్ర గాయాల య్యాయి. ఎస్సై జి.శివకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్ ఇరువర్గాలనూ చెదరగొట్టింది. 
 
 అంగన్‌వాడీ కార్యకర్త సస్పెన్షన్
 కిర్లంపూడి మండలంలోని పలు పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ నీతూ ప్రసాద్ తనిఖీ చేశారు. చిల్లంగిలో బూత్ లెవెల్ అధికారి అయిన అంగన్‌వాడీ కార్యకర్త హాజరు కాలేదని గుర్తించి సస్పెండ్ చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. 
 
 దొంగ ఓట్లు వేస్తున్న పీఒపై ఆగ్రహం
 కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు-2 పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి వెంకటలక్ష్మికి  పోలింగ్ అధికారే దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలింగ్ ముగిశాక 27 బ్యాలట్ పేపర్లను చింపి వెంకటలక్ష్మి గుర్తుపై ఓటు వేసి బ్యాలట్ బాక్సులో వేసేందుకు పీఓ ఎన్.జాన్ సిద్ధమయ్యారు. దీనిని ఏజెంట్లు అడ్డుకున్నారు. పార్టీలకతీతంగా గ్రామస్తులంతా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఏజెంట్‌పై చేయిచేసుకున్న ఎస్సై రవికుమార్‌తో పాటు దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన పీఓపై చర్యలు తీసుకోవాలని, రీపోలింగ్ నిర్వహించాలని  డిమాండ్ చేశారు.  
 
 మారిన బ్యాలట్ బండిల్స్
  రాజానగరం మండలం తూర్పుగానుగుడెం ఎంపీటీసీ బ్యాలట్ బండిల్స్‌లో పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన బ్యాలట్ బండిల్ కలిసిపోయింది. ఈ రెండుచోట్లా అభ్యర్థుల పేర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ, గుర్తులు ఒకే క్రమంలో ఉండడంతో తొలుత ఎవ్వరికీ సందేహం కలగలేదు. 37 ఓట్లు పోలైన తరువాత 38వ ఓటర్ ఈ తేడాను గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఆందోళనకు దిగారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు రిజర్వు బండిల్‌ను రప్పించి. అప్పటికే ఓటేసిన 37 మందితో మరోసారి ఓటు వేయించారు.
 
  కరప మండలం పెనుగుదురులో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఉంగరం గుర్తు కేటాయించగా 23వ నంబర్ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటిగంటకు తెరచిన బండిల్‌లో ఉంగరం స్థానంలో ఆటో కనిపించింది. అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. వాకాడలో  ఓ స్వతంత్ర అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించారు. ఆ బ్యాలట్ పత్రాలు పెనుగుదురు బండిల్‌లో కలిసిపోయాయని గుర్తించి, వెంటనే పోలింగ్‌ను ఆపేశారు. అప్పటికే వేసిన ఏడు ఓట్లను ఇన్‌వాలిడ్‌గా పరిగణించి వారికి మరోసారి ఓటు వేసే అవకాశం కల్పించారు. 
 గుండె పోటుతో ఓటరు మృతితొండంగి మండలం కొమానపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శివకోటి అప్పారావు (65) ఓటు వేసి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement