
ఐదు పాత ముఖాలతో.. మజ్లిస్ తొలి జాబితా
ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పిస్తూ మజ్లిస్ పార్టీ సోమవారం తొలి జాబితా ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో అధినేత అసదుద్దీన్ ఈ వివరాలను ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పిస్తూ మజ్లిస్ పార్టీ సోమవారం తొలి జాబితా ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో అధినేత అసదుద్దీన్ ఈ వివరాలను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట, యాఖుత్‌పురా, చార్మినార్, బహద్దూర్‌పురా, మలక్‌పేటల నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేలే తిరిగి బరిలో ఉండనున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కార్వాన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్‌ను తప్పించి అక్కడ ఆయన సూచించిన కౌసర్ మొహియుద్దీన్‌ను బరిలోకి దింపుతోంది. ఇక సౌమ్యుడిగా పేరున్న నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే విరాసత్ రసూల్‌ఖాన్‌కు మరోసారి అవకాశం ఇవ్వవద్దని నిర్ణయించిన పార్టీ, అక్కడి నుంచి జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్ హుస్సేన్ మెరాజ్‌ను రంగంలోకి దింపుతోంది.
హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు మజ్లిస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌తో అవగాహన ఉంటుండడంతో ఈ సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. అందుకే కచ్చితంగా పోటీ చేసే ఏడు నియోజకవర్గాలకు మాత్రమే పేర్లను ప్రకటించింది.మరికొందరి పేర్లతో రెండో జాబితాను రెండుమూడు రోజుల్లో ప్రకటించనున్నారు. నగరంలో రాజేంద్రనగర్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, గోషామహల్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్‌ల్లో అభ్యర్థులను దింపాలని భావిస్తున్నా... వీటిల్లో ఎక్కువ నియోజవర్గాలను కాంగ్రెస్ కోరుతోంది.
మారిన అసద్ పంథా...: మజ్లిస్ పార్టీలో టికెట్లను పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు శాసనసభలో ఆ పార్టీ నేత అక్బరుద్దీన్‌లు ఖరారు చేస్తారు. ప్రకటించేముందు ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తే అందుకు కారణాలను చెబుతారు. కానీ ఈసారి ముందస్తు సమావేశం లేకుండా అసదుద్దీన్ నేరుగా అభ్యర్థులను ప్రకటించారు. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే విరాసత్‌కు ఈసారి టికెట్ రాదని చాలారోజులుగా వినిపిస్తున్నా.. అసదుద్దీన్ ఆ విషయాన్ని ఆయనకు వివరించలేదని తెలిసింది. దీంతో అధినేత తీరుపై విరాసత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అసదుద్దీన్‌కు సన్నిహితుడిగా ముద్రపడిన నగర మేయర్ మాజిద్ హుస్సేన్‌కు నాంపల్లి టికెట్ ఖాయమని భావించినా, అక్బరుద్దీన్ అడ్డుపడ్డట్టు తెలిసింది. సికింద్రాబాద్ పార్లమెంటుకుగాని, అసెంబ్లీకి గాని ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉంది.
అభ్యర్థులు వీరే...
చాంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట- అహ్మద్ బలాలా, యాఖుత్‌పురా- ముంతాజ్‌ఖాన్, చార్మినార్-అహ్మద్ పాషా ఖాద్రి, బహద్దూర్‌పురా- మోజం ఖాన్, నాంపల్లి- జాఫర్ హుస్సేన్ మెరాజ్, కార్వాన్- కౌసర్ మొహియుద్దీన్.