ఎంఐఎంతో అవగాహన అవసరం
సోనియాకు డీఎస్ సూచన.. గంటపాటు భేటీ
తెలంగాణ పర్యటనకు సోనియా, రాహుల్‌కు ఆహ్వానం
వచ్చే ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు చీలకూడదంటే ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకుంటే మంచిదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సూచిం చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను దెబ్బతీ యాలంటే జేఏసీ నేతలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని కూడా గట్టిగా చెప్పారు. సోమవారం ఢిల్లీలో సోనియాతో ఆయన గంటపాటు భేటీ అయ్యారు. తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధతపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
తెలంగాణలో పార్టీ ప్రచారానికి సోనియా, రాహుల్‌లను డీఎస్ ఆహ్వానించారు. ఏప్రిల్ రెండో వారంలో ఒకరు, మూడో వారంలో ఒకరు పర్యటించాలని కోరారు. దీనికి సోనియా సానుకూలంగా స్పందించారు. కాగా ఎన్నికల్లో పార్టీ ప్రచార చిత్రాల కోసం రాహుల్‌తో ఫోటో సెషన్‌కు తెలంగాణ నేతలు హాజరయ్యారు. ఇందుకు 50 ఏళ్లు మించని నేతలకే ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సురేష్ శెట్కార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి హాజరయ్యారు. రాహుల్‌తో వీరంతా విడివిడిగా, ఉమ్మడిగా ఫోటోలు దిగారు.