
అమాత్య పదవిపై ఆశల మోసులు
- రేసులో యనమల, గోరంట్ల, చినరాజప్ప!
- ఎస్సీ కోటా నుంచి గొల్లపల్లి, పులపర్తి!
- తానూ ఉన్నానంటున్న పిల్లి అనంతలక్ష్మి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో టీడీపీ తరఫున 13 మంది ఎమ్మెల్యేలు కాగా వారిలో సగం మంది కన్నా ఎక్కువే మంత్రి పదవిని ఆశిస్తున్నారు. దశాబ్దం తర్వాత పార్టీకి అధికారంలోకి రావడంతో ఎవరికి వారు అవకాశాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అదే కేబినెట్ కూర్పులో అధినాయకత్వానికి చిక్కుసమస్యలా మారేలా ఉంది. అసలు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయి, ఏ సామాజికవర్గానికి అవకాశం దక్కుతుంది అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాకున్న ప్రాధాన్యం, ఎమ్మెల్యేల సంఖ్య ప్రాతినిధ్యం ప్రాతిపదికన మూడుకు తక్కువ గాకుండా మంత్రి పదవులు రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈలోగా.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఆశలపల్లకీలో ఊరేగుతున్నారు.
జిల్లా నుంచి మంత్రి పదవుల రేసులో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పల పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిలో రాజ్యసభకు వెళ్లాలనుకున్న యనమల చివరికి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవలసి వచ్చిం ది. మండలిలో విపక్షనేతగా వ్యవహరిస్తున్న ఆయన గతంలో ఆర్థికశాఖ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఈసారి ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆయనకు వరుసకు సోదరుడైన కృష్ణుడు తుని నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అదే యనమలకు మైనస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే దాంతో సంబంధం లేకుండానే పార్టీలో సీనియారిటీ, మంత్రిగా పనిచేసిన అనుభవంతో తిరిగి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. పార్టీలో మరో సీనియరైన గోరంట్ల కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు.
ఎన్టీఆర్ కేబినెట్‌లో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేసిన గోరంట్ల.. ఆ అనుభవం, పార్టీలో సీనియారిటీతో పదవి వరిస్తుందనే ధీమాతో ఉన్నారు. చంద్రబాబు సామాజికవర్గం నుంచి ఎన్నికైన పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావుల కన్నా తానే సీనియర్ కావడంతో అవకాశం తనదేనని భావిస్తున్నారు. అయితే పార్టీలో ఆది నుంచీ గోరంట్లకు ప్రత్యర్థిగా ఉన్న గన్ని కృష్ణ ఆయనకు చెక్ పెట్టేందుకు తెరవెనుక గట్టి ప్రయత్నాల్లో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.
రెండోసారి గెలిచిన వారిలోనూ ఆశలు..
కాగా సామాజికంగా బలమైన వర్గం నుంచి ఎన్నిక కావడం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రికార్డు స్థాయిలో పనిచేయడం తనకు సానుకూలమవుతాయని చినరాజప్ప ఆశిస్తున్నారు. కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ పదవిపై కూడా రాజప్ప ఆశ పెట్టుకున్నారని అంటున్నారు. పార్టీలోకి తన కంటే వెనుక వచ్చిన వారు పెద్ద, పెద్ద పదవులు నిర్వర్తించారని, ఈసారి తనకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతుందన్న నమ్మకంలో ఉన్నారని అంటున్నారు. కాగా ఎస్సీ సామాజికవర్గం నుంచి సీనియర్ అయిన తనకు అవకాశం ఖాయమని రాజోలు నుంచి ఎన్నికైన గొల్లపల్లి సూర్యారావు ఆశ పడుతున్నట్టు సమాచారం.
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, ఎంపీ టిక్కెట్టు ఇస్తానని చివరి నిమిషంలో రాజోలు నియోజకవర్గానికి పంపినా గెలుపొందడం తనకు అనుకూలంగా కాగలవని అంచనా వేస్తున్నట్టు చెపుతున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, మహిళ అందునా బీసీ కావడం తనకు అవకాశం తెచ్చి పెడతాయని కాకినాడ రూరల్ నుంచి ఎన్నికైన పిల్లి అనంతలక్ష్మి ఆశిస్తున్నారు. రామచంద్రపురం నుంచి గెలిచిన తోట త్రిమూర్తులు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నా.. పార్టీలు మారి, మారి వచ్చిన ఆయనకు అవకాశం కష్టమేనంటున్నారు. వీరితో పాటు రెండోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కూడా అమాత్యయోగంపై మక్కువ పడుతున్నారు.