
చీకట్లోనే ఓటేసిన మీసాభారతి
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుమార్తె మీసా భారతి చీకట్లోనే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీహార్లోని ఏడు లోక్సభ స్థానాలకు రెండో విడతలో భాగంగా గురువారం నాడు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, నలంద, జెహానాబాద్, ముంగేర్, ఆరా, బుక్సర్ స్థానాలు అన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్న మీసాభారతి గురువారం ఉదయం ఓటు వేయడానికి వెళ్లేసరికి పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా లేదు. దాంతో చీకట్లోనే ఆమె తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
బాలీవుడ్ నటుడు షాట్గన్ శత్రుఘ్న సిన్హా, హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్, మీసాభారతితో పాటు ఆమె ఇద్దరు బాబాయిలు రాంకృపాల్ యాదవ్, రంజన్ యాదవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం 42,600 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వారితో పాటు 152 కంపెనీల కేంద్ర బలగాలు, 42 కంపెనీల బీహార్ మిలటరీ పోలీసులను కూడా రంగంలోకి దించారు.