పల్లెపోరు..
Published Tue, Apr 1 2014 2:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల హడావుడి
అన్ని మండలాల్లో ఊపందుకున్న ప్రచారం
జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 208 మంది అభ్యర్థులు
887 ఎంపీటీసీ స్థానాలకు 2,374 మంది అభ్యర్థులు
పలు మండలాల్లో సైకిల్ ఎక్కిన కాంగ్రెస్
మళ్లీ భయోత్పాతానికి తెలుగుదేశం వ్యూహరచన..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పట్టణాల్లో ఎన్నికల పోరు ముగిసింది. ఇక పల్లెల్లో ఎన్నికల సమరం పైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. జిల్లాలో రెండు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6న తెనాలి, నరసరావుపేట డివిజన్ల పరిధిలో 11న గుంటూరు, గురజాల డివిజన్ల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వీటిలో టీడీపీ మొత్తం స్థానాలకు పోటీ చేయనుంది. వైఎస్సార్ సీపీ 55 స్థానాల్లో పోటీచేస్తుంది. పొత్తులో భాగంగా వైఎ స్సార్ సీపీ తాడేపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.
బరిలో 2582 మంది అభ్యర్థులు.. జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 208 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 913 ఎంపీటీసీ స్థానాల్లో 25 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 887 స్థానాల్లో 2,374 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.కాగా, సాతులూరు-2 ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో వాయిదా అనివార్యమైంది. ‘స్థానిక’పోరులో వున్న అభ్యర్థులు వారి ప్రచారాన్ని మమ్మురం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గడప గడపకు తిరుగుతూ తమకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
టీడీపీ .. కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు... మరోవైపు వైఎస్సార్ సీపీని తట్టుకొని నిలిచేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారన్న విమర్శలు వస్తున్నాయి. తెనాలి, రేపల్లె, బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లోని ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరు. దీంతో నేరుగా కాంగ్రెస్ నాయకులు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మళ్లీ భయోత్పాతానికి వ్యూహరచన..
జిల్లాలోని 12 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇదే పంథాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కొనసాగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, నరసరావుపేటల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు ఎన్నికల్లో హల్‌చల్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కుర్రి పున్నారెడ్డి, ఇతర నాయకులు వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనేందుకు ఒక్కటై పనిచేస్తున్నారు.
అలాగే గురజాల, రెంటచింతల, వెల్దుర్తి, కారంపూడి, పిడుగురాళ్ల తదితర స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. పల్నాడుకు అదనపు బలగాలు... ఇదిలా ఉంటే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలుతీసుకొంటుంది. ముందుగానే ఆయా ప్రాంతాలపై పోలీసులు, ఎన్నికల సంఘం, జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించారు. అలాగే పల్నాడుకు అదనపు బలగాలను తరలించేందుకు సిద్ధమవుతున్నారు.
Advertisement