టీ-కాంగ్రెస్‌లో టెన్షన్!
టీ-కాంగ్రెస్‌లో టెన్షన్!
Published Wed, May 14 2014 5:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
పల్లె తీర్పుతో పార్టీ నేతల్లో గుబులు
24 గంటల్లోనే నీరుగారిన ఉత్సాహం
జెడ్పీటీసీల్లో టీఆర్‌ఎస్ హవాతో కలవరం
సంస్థాగత నిర్మాణం లేకున్నా
ఆ పార్టీ నెగ్గడంపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కథ అడ్డం తిరిగింది! టీ-కాంగ్రెస్‌కు టెన్షన్ మొదలైంది. మున్సిపల్ ఫలితాలతో ఆ పార్టీలో ఉరకలేసిన ఉత్సాహం పల్లె తీర్పుతో నీరుగారింది. 24 గంటల ముందు చిందులేసిన నేతలు మంగళవారం నాటి జడ్పీటీసీ ఫలితాలతో డీలా పడ్డారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ రావడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. తమకన్నా అదనంగా సుమారు 50 జడ్పీటీసీలను గులాబీ దళం ఎగరేసుకుని పోవడంతో పునరాలోచనలో పడ్డారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాదులున్న కాంగ్రెస్‌ను సంస్థాగత నిర్మాణమే లేని టీఆర్‌ఎస్ చావుదెబ్బ తీయడాన్ని ఊహించుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్‌తోనే తెలంగాణ వచ్చిందని ఊరూరా తిరిగి ప్రచారం చేసినా.. పల్లె ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్ పక్షాన నిలవడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. 2006లో తెలంగాణలో ఒకే ఒక్క జిల్లా పరిషత్(నిజామాబాద్)ను సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్ ఈసారి ఏకంగా మూడు జడ్పీలను కైవసం చేసుకుంది. మరో మూడింట్లో కాంగ్రెస్‌తో హోరాహోరీగా నిలిచింది. ఈ పరిణామంతో టీ కాంగ్ నేతల్లో కలవరం మొదలైంది. సార్వత్రికంలోనూ ఈ తీర్పే పునరావృతం అవుతుందేమోనన్న భయం వారిని వెన్నాడుతోంది.
సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్ల తీర్పే నిర్ణయాత్మకంగా మారనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి తప్పేలా లేదన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జడ్పీ ఫలితాల సరళిని పరిశీలించిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరు మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. అయితే జడ్పీటీసీతో పోల్చితే ఎంపీటీసీ ఫలితాలు కాంగ్రెస్‌కు కొంత ఊరటనిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కన్నా మెరుగైన ఫలితాలు రావడంతో సాధారణ ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఈ ఫలితాలను బట్టి టీఆర్‌ఎస్‌కు ధీటుగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటామనే భావన కలుగుతోందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే సంస్థాగతంగా పటిష్టంగా కేడర్ ఉన్న పార్టీ నేతలు తమ సొంత బలంతోనే ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారని పార్టీలోని మరికొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలు ఆశావహంగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement