సాక్షి, అనంతపురం : మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ పర్వం ముగిసింది. 14వ తేదీ నామినేషన్ల స్వీకరణ పర్వం ముగియగా మంగళవారం ఉపసంహరణ ఘట్టం ముగిసింది. జిల్లాలోని అనంతపురం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లతో పాటు ఎనిమిది మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 323 వార్డులకు గానూ 3 వేల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎక్కువగా రెబల్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు లేకపోగా, టీడీపీకి మాత్రం రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది.
ఆ పార్టీలో తొలి నుంచి కొనసాగుతూ వస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను కాదని, కేవలం అంగబలం, అర్థబలం ఉన్నవారికే టీడీపీ నాయకులు టికెట్లు కేటాయించారు. దీంతో అలకబూనిన టీడీపీ నాయకులు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. అనంతపురం కార్పొరేషన్‌లో మొత్తం 222 మంది బరిలో ఉన్నారు. వీరిలో ైవె ఎస్సార్‌సీపీ తరఫున 45 మంది, టీడీపీ తరఫున 49 మంది, కాంగ్రెస్ తరఫున 22 మంది బరిలో ఉన్నారు. అయితే మిగిలిన పార్టీలను పక్కనపెడితే టీడీపీలో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. అధినాయకత్వం వీరిని ఎంతగా బుజ్జగించినా వారు ససేమిరా అంటూ బరిలో నిలిచారు. అనంతపురం నగర కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
తుఫాను ముందు ప్రశాంతతే
జిల్లాలో అందరి దృష్టి నెలకొన్న అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తుఫాను వాతావరణాన్ని ఎదుర్కొనబోతోంది. మంగళవారం టీడీపీ నాయకుడు మహాలక్ష్మి శ్రీనివాస్ ఓ న్యాయవాది ఇంట్లో ‘బి’ఫారాలు అందజేశారు. అయితే సోమవారం మహాలక్ష్మి ప్రకటించిన 49 మంది పేర్లలో 25 మందికి కూడా బీ ఫారాలు ఇవ్వకుండా అప్పటికప్పుడు నిర్ణయాన్ని మార్చుకుని కేవలం డబ్బున్న వారికే బీ ఫారాలు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహాలక్ష్మి చర్యలను నిరసిస్తూ.. బీఫారం దక్కని ఆశావహులు దుమ్మెత్తి పోస్తున్నారు.
కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి తమకు బీఫారాలు ఇవ్వలేదని, అయితే ప్రజాబలం తమకు ఉందంటూ వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకుండా రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
దీంతో ఒకరినొకరు ఓడించుకోవడానికి పథకం వేసుకుంటున్నారు. కదిరి, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం, రాయదుర్గం మునిసిపాలిటీలలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో అలకబూనిన పార్టీ నాయకులు తన అనుచరులను రెబల్స్‌గా బరిలో నిలిపి.. టీడీపీ అభ్యర్థుల ఓటమే టార్గెట్‌గా ఎన్నికల బరిలోకి దింపడంతో ఈ వ్యవహారం మరింత గందరగోళానికి దారి తీసింది. ముఖ్యంగా అనంతపురం కార్పొరేషన్‌లో నెలకొన్న పరిణామం ఎన్నికల్లో బయటపడనుందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కార్పొరేషన్‌లో.. డివిజన్లలో టీడీపీ నుంచి ..మంది రెబల్స్‌గా బరిలో ఉన్నారు. ఈ డివిజిన్లలో రెబల్స్ ప్రతిఘటన టీడీపీకి సంకటంగా మారింది.
కాంగ్రెస్ అంటేనే బేజారు.. స్వతంత్రులుగానే పోటీ
విభజనతో కాంగ్రెస్ జనాగ్రహానికి గురవడమే కాకుండా ముఖ్య నేతలకు రాం..రాం చెప్పేశారు. కార్పొరేషన్‌లోని డివిజన్లతో పాటు మునిసిపాలిటీల్లోని వార్డుల్లో పట్టున్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్వతంత్రులుగానే బరిలో నిలిచారు. స్వతంత్రుల్లో కొన్ని చోట్ల గెలిచే సత్తా ఉన్న వారు ఉండగా, మరికొన్ని చోట్ల ఇతరుల గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది.
ముఖ్యంగా పామిడి నగర పంచాయతీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి లేకపోగా, 20 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులే బరిలో ఉన్నారు. అలాగే గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా సొంత మునిసిపాలిటీ అయిన గుత్తిలో కాంగ్రెస్ తరఫున ఒక్క అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ పరిణామాలన్నీ జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీకి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రెబల్ గుబులు!
Published Wed, Mar 19 2014 2:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement