కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్ర జిల్లాలో తుస్సుమంది. పార్టీ వర్గాలు భావించిన రీతిలో జనస్పందన కనిపించలేదు. కర్నూలు పాతబస్టాండులోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ గందరగోళంగా మారింది. ఈలలు, అరుపులే తప్ప పార్టీ నేతల సందేశాలు ఎవరికీ వినిపించకుండా పోయాయి. పార్టీ కార్యకర్తల కంటే చిరంజీవిని చూసేందుకు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. కొందరు అభిమానులు బల్లలెక్కి, కుర్చీలెక్కి అడ్డంగా నిలవడంతో.. సామాన్యులు నిరుత్సాహానికి గురై సభ మధ్యలోనే వెళ్లిపోయారు. మొదట పోలీసులు వేదిక వద్ద నుంచి అందర్ని పంపి వేసినా గోల అధికమయ్యే కొద్దీ వారు నిమ్మకుండిపోయారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బస్సుయాత్ర గురువారం సాయంత్రం కర్నూలు నగరానికి చేరింది. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ దిక్కుమొక్కు లేకుండానే ముగిసింది. సభకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, 2014 ఎన్నికల మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ఛైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మంత్రులు జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలరాజు, కొండ్రు మురళీ, డొక్కా మాణిక్యవరప్రసాద్, డీసీసీ నాయకులు తదితరులు హాజరయ్యారు.
వీరి సభకు ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి అహ్మద్‌అలీఖాన్ అనుచరులు తప్ప పార్టీ కార్యకర్తల సంఖ్య పల్చగా కనిపించింది. వీరి అల్లరికి సభలో ప్రసంగించిన వక్తలంతా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. డీసీసీ అధ్యక్షుడు, పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పదేపదే వారించినా ప్రయోజనం లేకపోయింది. నాయకులు కూడా చెప్పిందే చెప్పుకుంటూ వెళ్లడంతో ఎవరూ వినిపించుకోలేదు. ప్రతివక్త కూడా రాష్ట్ర విభజన పాపం తమది కాదని, ఇందులో అందరి ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర విభజనతో రాయలసీమకు, కోస్తాంధ్రకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని రెండో వాదనను వినిపించారు. ఓటు టీడీపీకి వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని చిరంజీవి అన్నారు.