సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అధికార కాంగ్రెస్‌లో కుమ్ములాటలు షురూ అయ్యాయి. అసలే వర్గాలుగా విడిపోయి జిల్లాలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల బీఫాం వివాదం ఏకం గా ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలి ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి వర్గాలకు చెందిన నేతలు తమకు టికెట్ కావాలంటే తమకే కావాలని పట్టుబట్టడంతో వారిని బుజ్జగించడం నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది.
మున్సిపల్ ఎన్నికల పుణ్యమాని ఇరు వర్గాల నేతల మధ్య విభేదాలు మరింత ము దురుతున్నాయని, ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని కింది స్థాయి కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడే ఆత్మహత్యలకు యత్నించడం... సెల్‌టవర్‌లు ఎక్కడం లాంటి ఘటనలు జరిగితే... ఇక స్థానిక ఎన్నికలు, సా ర్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా కాంగ్రెస్ రాజకీయం మరింత రసకందాయంలో పడుతుందని రాజకీయ వర్గాలంటున్నాయి.
ఇల్లెందులో ‘ఇక్కట్లు’
ఇల్లెందు మున్సిపాలిటీలో పార్టీ బీఫాంలు ఇచ్చే విషయంలో స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి బలరాంనాయక్ వ్యవహరించిన తీరుకు మనస్తాపం చెందానంటూ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోచికొండ శ్రీదేవిఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడం సంచలనమే సృష్టించింది. మంగళవారం ఇల్లెందులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ఎదుటనే పురుగుల మందు తీసుకుని ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చైర్‌పర్సన్ బరిలో ఉన్న తనకు కాకుండా మరో అభ్యర్థికి పార్టీ బీఫాం ఇవ్వడంతో రేణుకా చౌదరి వర్గానికి చెందిన ఈమె ఈ చర్యకు పాల్పడ్డారు.
ఇక, రేపటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రేసులో ముందంజలో ఉన్న కోరం కనకయ్య అనుచరుడు అక్కిరాజ్ గణేష్ 15వ వార్డు నుంచి నామినేషన్ వేసినా, అక్కడ సుదర్శన్‌కోరి అనే మరో నాయకుడికి బీఫారం ఇచ్చారు. దీంతో అతను గోవింద్‌సెంటర్‌లోని సెల్‌టవర్‌పైకి ఎక్కి గంటపాటు హల్‌చల్ చేశాడు. ఓ దశలో అక్కడి నుంచి దూకేందుకు యత్నించాడు కూడా. ఆయన భార్య రోదిస్తూ అక్కడే సొమ్మసిల్లిపోయారు. చివరకు బీఫాం ఇస్తానని కోరం కనకయ్య హామీ ఇచ్చేంతవరకు ఆయన సెల్‌టవర్ దిగి రాలేదు. కాగా, శ్రీదేవి విషయంలో డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు బీఫాం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆయన బీఫాంలన్నీ ఎంపీ బలరాం నాయక్‌కు ఇచ్చేశారని, అదే వనమా బీ ఫారం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా తన వర్గానికి చెందిన శ్రీదేవికే ఇచ్చేవారనే చర్చ కూడా జిల్లా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలకు అద్దం పడుతోంది. ఈ రెండు ఘటనలు జరిగాయి కాబట్టి బయటకు వచ్చాయని, ఇంకా చాలా వార్డుల్లో ఇలాంటి ఆవేదనే నెలకొందని స్థానిక పార్టీ శ్రేణులంటున్నాయి.
సగం వార్డుల్లో ఇద్దరిద్దరు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు గాను 97 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ వార్డుల్లో దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే సగానికి పైగా వార్డుల్లో అధికార పార్టీ తరఫున ఇద్దరిద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని చోట్ల ముగ్గురు కూడా బరిలో నిలిచారు. అయితే, వీరికి నచ్చజెప్పి నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు అధికార పార్టీ నేతలకు తల ప్రాణం తోకకొచ్చిందనే చెప్పాలి. జిల్లాలో రెండు గ్రూపులున్న నేపథ్యంలో.... తమ గ్రూపే ఎందుకు ఉపసంహరించుకోవాలనే ధోరణిలో ఇరు వర్గాలు బెట్టుగా వ్యవహరించాయి. దీంతో పార్టీ నాయకత్వం గత వారం రోజులుగా మల్లగుల్లాలు పడుతూనే ఉంది.
ఒక్క ఇల్లెందు మున్సిపాలిటీలోనే ఏకంగా 34 మంది కాంగ్రెస్ తరఫున రెబల్స్‌గా నిలిచారు. వాస్తవానికి అక్కడ కేవలం 18 స్థానాల్లోనే ఆ పార్టీ పోటీచేయాలి. కానీ 24 వార్డుల్లో ఆ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్‌తో పాటు సీపీఐ పోటీచేసే చోట్ల కూడా వీరు ఉపసంహరించుకోకపోవడం గమనార్హం.
ఇక మధిర నగర పంచాయతీలో మొత్తం 17 వార్డులకు గాను 26 మంది కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేయగా, అందులో ఏడుగురు మాత్రమే ఉపసంహరించుకున్నారు. మరో ఇద్దరు ఇంకా బరిలోనే ఉన్నారు. అయితే, ఉపసంహరించుకున్న వారిలో కొందరికి ఎంపీటీసీలుగా అవకాశం కల్పిస్తామని నాయకులు హామీ ఇవ్వాల్సి వచ్చింది. మరికొందరికి ఏవో ఆశలు చూపి వెనక్కు తగ్గించినా వారు పార్టీ అభ్యర్థులకు ఏ మేరకు సహకరిస్తారనేది సందేహమే. ఇక సత్తుపల్లిలో కూడా చివరి రోజున ఏడుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కొత్తగూడెం స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే... జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది.
కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి
Published Wed, Mar 19 2014 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement