సాక్షి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ముస్లింలు మండిపడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపాలీటీ ఎన్నికల్లో మైనార్టీలకు తగిన ప్రాధాన్యత, గుర్తింపును ఇవ్వకపోవడంతో అధిష్టానం అంక్షింతలు వేసినట్లు తెలిసింది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో ఒక్కరంటే ఒక్క మైనార్టీకీ కూడా అవకాశం కల్పించలేదు.
ఎంపీటీసీ, మునిసిపల్ కార్పొరేషన్లలో కూడా నామమాత్రంగానే మైనార్టీ అభ్యర్థుల ఎంపికను నిర్వహించి చేతులు దులుపుకున్న విషయంపై అధిష్టానానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. అసలు విషయం తెలుసుకున్న అధిష్టానం జిల్లా నేతలకు తలంటింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ుునిసిపాలిటీలలో మైనార్టీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో..సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒక వైపు వైఎస్సార్‌సీపీ నలుగురు ముస్లింలను జెడ్పీటీసీ అభ్యర్థులుగా ఎంపిక చేయడంతోపాటు, మునిసిపాలిటీలు, ఎంపీటీసీల్లో కూడా సముచిత స్థానం కల్పించింది.
అనంతపురం ఉప మేయర్‌ను ముస్లిం అభ్యర్థికే కేటాయిస్తున్నామంటూ ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ మైనార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యతను టీడీపీ అధిష్టానం ఆరా తీసి.. ఆ పార్టీ తరహాలో ఎందుకు మైనార్టీలకు ప్రాధానత్య ఇవ్వలేదని అంక్షింతలు వేయడంతో జిల్లా నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు.టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లతో పాటు ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కీలక పాత్ర వహించారు.
మైనార్టీలు టీడీపీకి ఓటు వేయరని, వారంతా వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారని గతంలో బీకే పార్థసారథి ముస్లింలపై అక్కసు వెల్లగక్కారు. పెనుకొండలో ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ముస్లింలు టీడీపీకి ఓటు వేయరని బహిరంగంగా ప్రకటించారు. పార్థసారథి తీరుపట్ల టీడీపీలోని మైనార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్పట్లో హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని పార్థసారథిపై వాదులాటకు దిగినప్పటికి ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహకరించుకోలేదు. టీడీపీ.. బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ముస్లింలు ఏవిధంగానూ టీడీపీ వెంట రారనే ఉద్దేశంతోనే ముందస్తుగా జిల్లాలో టికెట్లు కేటాయించలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జిల్లాలో మైనార్టీల పట్ల జరిగిన అన్యాయం గురించి అధిష్టానం వివరణ కోరినప్పటికి నేతల నుంచి సరైన సమాధానం వెళ్లలేదని తెలిసింది. టీడీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించే పరిస్థితి లేకపోయింది. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని మైనార్టీల తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం స్థానం నుంచి బాలక్రిష్ణ బరిలోకి దిగుతున్నాడన్న ప్రచారం ఉండడంతో ఆ సీటు కూడా కోల్పోతామని ముస్లింలు చెబుతున్నారు. కాగా జిల్లాలో కమ్మ సామాజికవర్గానికి ఐదు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నారు.
కళ్యాణదుర్గం ఉన్నం హనుమంతరాయ చౌదరి, ధర్మవరం వరాదపురం సూరీ, రాప్తాడు పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావుల కేశవ్, అనంతపురం ప్రభాకర్‌చౌదరి పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. అనంతపురంలో మైనార్టీలు అధికంగా ఉండడంతో పార్టీ నేతలు నదీం అహమ్మద్, మాజీ ఎంపీ కేఎం సైఫులా తనయుడు జకీఉల్లా అనంతపురం సీటును ఆశిస్తున్నారు. అయితే ఈ సీటు ఇచ్చే విషయం మీద పార్టీలో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది.
జిల్లాలో మైనార్టీలకు టీడీపీలో సముచిత స్థానం లేదని టీడీపీకి ఆ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న కదిరికి చెందిన అత్తార్ చాంద్‌బాషా, తాడిపత్రి ఫయాజ్, అనంతపురానికి చెందిన సాలార్‌బాషా ఎప్పుడో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి..వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. టికెట్ల కేటాయింపులో అన్యాయం చేస్తున్న టీడీపీ తీరుపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆయా నియోజకవర్గాల్లో త్వరలో సమావేశాలు పెట్టి టీడీపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమౌతున్నారు.
టీడీపీపై ముస్లింల ఆగ్రహం
Published Sat, Mar 29 2014 4:08 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement