అనంతపురం టౌన్: టీడీపీ ప్రతి ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ రాజకీయ వ్యభిచారం చేస్తోందని అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వంచనపై గర్జన దీక్షను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా «కృతజ్ఞతలు తెలిపారు. పూటకో పార్టీతో కలిసిపోయే టీడీపీ నేతలకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికహక్కు లేదన్నారు. చౌకబారు విమర్శలు చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ‘‘1996, 1999లో బీజేపీతో కలిసి పని చేయలేదా? 2009లో టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో జతకట్టి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు.
ఆ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడంతో మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని బహిరంగ ప్రకటనలు చేసి 2014లో మళ్లి బీజేపీ కూటమితో వెళ్లలేదా? నాలుగేళ్లు వారితో కలిసి కాపురం చేయలేదా?’’ దీన్ని ఏమనాలో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాటి నుంచి నేటి వరకు లౌకికవాదానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తమ పార్టీ బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించేలా విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల మిగులు పనులను పూర్తి చేసేందుకు అంచనా విలువలు పెంచుకుంటూ వందల కోట్లు దోచుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్లుగా ఏ పార్టీ పోరాటం చేస్తోందో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ప్రత్యేక హోదా కోసం కాకుండా ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాటం చేసింది చంద్రబాబు కాదా అన్నారు. చిత్తశుద్ధి లేకుండా ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ నేతలు ఉత్తుత్తి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతలకు ఓటమి భయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ బలపడుతుండడంతో టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. అందులో భాగంగానే బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా బీజేపీతో సహజీవనం చేసి నేడు ప్రజలను మభ్యపెట్టేందుకు కుటిల రాజకీయాలకు తెబడ్డారు. గత నాలుగేళ్ల టీడీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి ఏమైనా జరిగిందా? అమరావతి రాష్ట్ర రాజధానిగా కాకుండా వ్యాపార కేంద్రంగా మార్చారు. టెండర్లు సైతం ఎవరికి వస్తాయో ముందస్తుగానే తెలిసిపోతోంది. మైనార్టీల ఓట్లు దండుకునేందుకే బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతోందని బురద జల్లుతున్నారు. ఎన్నికలు దగ్గర పడితే చంద్రబాబు చేసే రాజకీయమే ఇది. నంద్యాల ఎన్నికల్లో సైతం ఇదే సిద్ధాంతాన్ని పాటించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన మైనార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు.– విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ఉరవకొండ
మంత్రి పదవి పోతుందనే విమర్శలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టకపోతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లకపోతే మంత్రి పదవి ఊడుతుందనే భయంతోనే మంత్రి కాలువ శ్రీనివాసులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి మంత్రి పదవి సాధించుకోవడం కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. గత నాలుగేళ్ల కాలంలో జిల్లాను ఏమి అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే పుట్టగతులుండవు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడే మీకు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఎక్కడిది. వంచనపై గర్జన దీక్షకు జిల్లా నలుమూలల నుంచి వచ్చి జయప్రదం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు.– శంకర్‌నారాయణ, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment