కదిరి: ‘ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక పోయాను. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నా.’– టీడీపీ కండువా కప్పుకునే సమయంలో చాంద్‌బాషా చెప్పిన మాటలివి.
కానీ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి జరిగిందా? అని కదిరిలో ఎవరినైనా ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేతో పాటు అడిగిన వారికీ తలంటుతారు. అత్తార్ చాంద్‌బాషా పార్టీ మారి సుమారు రెండేళ్లు కావస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. వర్షం వస్తే ఆయన కాపురముంటున్న వలీసాబ్‌రోడ్ మొత్తం మురుగు నీటితో నిండిపోయి ఆయన ఇంటికి వెళ్లేందుకూ దారి ఉండదు. కనీసం ఆయన కూడా ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే బయటకు రాలేని పరిస్థితి. ఆ వీధిలోకాపురముంటున్న చాలా ఇళ్లలోకి ఆ నీరు చేరుతుంది. అందుకే కదిరిలో జోరుగా వర్షం కురిస్తే వలీసాబ్‌రోడ్‌తో పాటు పరిసరాల్లో కాపురముంటున్న వారిలో ఎమ్మెల్యే చాంద్‌బాషాపై నోరుచేసుకోని వారుండరు. ‘‘ఇదేనా మీ అభివృద్ధి..? మీ ఇంటి దగ్గర.. మీ కళ్లముందే ప్రజలు పడుతున్న అవస్థలు చూస్తున్నారు.. పైగా బాధితుల్లో మీరూ ఒకరు. కానీ సమస్య పరిష్కరించలేకపోతున్నారు. ఇక నియోజకవర్గాన్ని మీరెంతగా అభివృద్ధి చేసుంటారో మేము అర్థం చేసుకోగలం.’’ అని వలీసాబ్‌రోడ్ వాసులు విమర్శిస్తున్నారు.
వార్డు సమస్య కూడా నేనే పరిష్కరించాలా?
వార్డులో నీళ్లు రాకపోయినా.. వీధి లైటు వెలగకపోయినా.. చెత్త ఉన్నా ఆ వార్డు కౌన్సిలర్‌కు చెబితే పరిష్కరిస్తారు. అంతేకానీ అన్ని సమస్యలూ ఎమ్మెల్యే పరిష్కరించరు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీల్లాగా.. మున్సిపాలిటీలో కౌన్సిలర్లుంటారు.. వాళ్లే చూసుకుంటారు. – చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి
తన అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయింపు
నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చాంద్‌బాషా చేసిందేమీ లేదు. తన వ్యక్తిగత అభివృద్ధి కోసమే పార్టీ మారాడు తప్ప. ఇంకోటి లేదు. కదిరికి రింగ్‌రోడ్ అన్నారు. నాలుగేళ్లు అవుతున్నా అతీగతీ లేదు. రోడ్ల విస్తరణ పేరుతో పేదోళ్ల ఇళ్లన్నీ కూల్చేశారు. చాంద్‌బాషా లాడ్జీని నామమాత్రంగా కూల్చినా మళ్లీ యథావిధిగా కట్టుకున్నాడు. హజ్‌కు పోయిన వారు అబద్ధాలు చెప్పరు. చాంద్‌బాషా నోటినుంచి వచ్చేవన్నీ అబద్ధాలే. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీని తిడుతున్నారు. వానొస్తే నీళ్లన్నీ వచ్చి ఆయన ఇంటికే దారి ఉండదు. ఆయన ఆ ఒక్క సమస్య పరిష్కరిస్తే చాలు. – అంజాద్, కదిరి
Comments
Please login to add a commentAdd a comment