నేడు బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానానికి నామినేషన్
సాక్షి, బెంగళూరు: ‘‘రూ. 10 వేలతో ఇన్ఫోసిస్ స్థాపించాం. చిన్న స్థాయి నుంచి విజయవంతమైన కంపెనీగా ఎదగడంతో ఈరోజు నాకు, నాభార్య రోహిణికి కలిపి రూ. 7,700 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి’’ అని కాంగ్రెస్ నేత, ఆధార్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. విజయవంతమైన వ్యాపారవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన నందన్ నీలేకని బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో... అంతకు ఒకరోజు ముందే ఆయన తన ఆస్తుల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. ఐఐటీ పూర్తి చేసినప్పుడు తన జేబులో కేవలం 200 రూపాయలే ఉన్నాయని నీలేకని తెలిపారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో నందన్ నీలేకని కూడా ఒకరన్న విషయం తెలిసిందే.