తెలంగాణ శత్రువు మోడీ :కేసీఆర్ | narenda modi is telangana enemy, says kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ శత్రువు మోడీ :కేసీఆర్

Published Fri, Apr 25 2014 1:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

తెలంగాణ శత్రువు మోడీ :కేసీఆర్ - Sakshi

తెలంగాణ శత్రువు మోడీ :కేసీఆర్

సీమాంధ్రుల చేతిలో పావులా మారాడు
వెంకయ్య, బాబు స్క్రిప్ట్‌తోనే మోడీ డైలాగ్‌లు
 ప్రజలను గోల్‌మాల్ చేసే యత్నం
 మోసం చేయాలని చూస్తే తెలంగాణ తిరగబడతది
 బాబును మెడలువట్టి తోసినా పోతలేడు
 బీజేపీకి ఓటేస్తే బాబుకు పడినట్లే
 మెదక్, నిజామాబాద్‌లలో విస్తృత ప్రచారం
 
 సాక్షి, మెదక్, నిజామాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తున్నారని, దాన్ని జనం తిప్పికొడతారని టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అగ్రనేత వెంకయ్యలను ఉద్దేశించి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. బాబు, వెంకయ్య రాసిచ్చిన స్క్రిప్ట్‌నే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చదివారని విమర్శించారు. మోడీని తెలంగాణ శత్రువుగా ప్రకటిస్తున్నామన్నారు. ఆయన తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు. రాత్రి మెదక్ పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ టీఆర్‌ఎస్ చీఫ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ-బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ‘మెడలువట్టి తోసినా.. సీమాంధ్ర చంద్రబాబు తెలంగాణను విడిచి పోతలేడు. చంద్రబాబు చేష్టలు చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గు పడుతున్నయి.
 
 వెంకయ్య, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను హైదరాబాద్‌లో మోడీ సదివిండు. ఇటుపక్క బాబు, అటుపక్క పవన్ కల్యాణ్.. రెండు పక్కల ఆంధ్రోళ్లను కూసుండబెట్టుకుని తెలంగాణోళ్లను గోల్‌మాల్ చేయాలని చూసిండు. కానీ గోల్‌మాల్ కావడానికి తెలంగాణోళ్లు తెలివిలేనివారు కారు. బొబ్బిలి పులులై తిరగబడటానికి తయారవుతున్నరు’ అని కేసీఆర్ అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పిన మోడీకి తెలంగాణ ప్రజల బతుకు బాధలు, వెయ్యికిపైగా ఆత్మత్యాగాల ఘోష ఏమి తెలుసని ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో 1 ప్లస్ 1 ప్లస్ 1 కలిసి నూటాపదకొండుఅయ్యిందని కలలు కంటున్నారని, ట్రిపుల్ జీరో అయ్యారని వారు గుర్తించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నేతలు ఆడిస్తున్న నాటకంలో పావులా మారిన మోడీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని కేసీఆర్ మండిపడ్డారు.
 
 బాబు మాటలు నమ్మితే మోడీకి కన్నీళ్లే
 
 పూటకో వేషం.. రోజుకో మాటతో చంద్రబాబు నక్కజిత్తుల మాయగాడని, ఎలక్షన్ల తర్వాత ఆయన జైలుకెళ్లక తప్పదని కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్న నీచుడు చంద్రబాబు.. బీజేపీకి వేసే ప్రతి ఓటు చంద్రబాబుకే పడుతుంది జాగ్రత్త’ అని ఓటర్లను కేసీఆర్ హెచ్చరించారు. బాబు మాటలు నమ్మితే మోడీకి మిగిలేది కన్నీళ్లేనన్నారు. ‘గతంలో మోడీ మతతత్వవాదని వాజ్‌పేయికి ఫిర్యాదు చేసిన వాడు.. హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ఆయన వస్తే అల్లర్లవుతాయని వారించిన వ్యక్తి.. ఏకంగా ఆయనతోనే జతకడితే ఏమనాలే’ అంటూ విమర్శలు గుప్పించారు.
 
 ఓటమి తప్పదనే నా వెంట పడుతున్నారు
 
 ‘టీఆర్ ఎస్ గెలుపు ఖాయమై పోయింది.. 90 ఎమ్మెల్యే, 16 ఎంపీ స్థానాల్లో విజయం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కడు కేసీఆర్‌ను విమర్శించుడే. బాబు, మోడీ, పవన్‌కల్యాణ్, పొన్నాల వంటి నేతలంతా నావెంట పడుతుండ్రు. ఎక్కడ తెలంగాణపై తమ అధికారం పోతదోనని వాళ్ల భయం. ఇది ముమ్మాటికీ జరుగుతది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో కబ్జాదారుల భూముల పరిరక్షకులుగా వ్యవహరించాలని వెంకయ్య, చంద్రబాబు, మోడీ చూస్తున్నారని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాల్లో ఉన్న భూముల్ని వెనక్కు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బాబు మోసాలపై విచారణ జరిపించి జైలుకు పంపడం ఖాయమన్నారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని, సీడ్ రీసెర్చ్ సెంటర్‌ను బోధన్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 
 ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నారా?
 
 కత్తి ఆంధ్రోళ్లది.. పొడిచేటోళ్లు తెలంగాణోళ్లు అంటూ టీ-కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. ‘ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రాకు పోవాలంటే జానారెడ్డి, పొన్నాల, దామోదర రాజనర్సింహలు.. గట్లెట్ల పోతరని అడుగుతున్నరు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల ఓట్లపై ఆశతో ఈ మాటలు మాట్లాడుతున్నరు. నేను మాత్రం గట్లనే పోవాలని చెబుతున్నా. మీరేనాడైనా లాఠీ దెబ్బలు తిన్నరా? జైళ్లకెళ్లిండ్రా.. కనీసం పదవులైనా వదులుకున్నరా?’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. 1971లో దళితులకిచ్చిన 14 ఎకరాల భూమిని పొన్నాల కబ్జా చేసి 1991లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలు ఓ దొంగను టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారని విమర్శించారు. గవర్నర్ చొరవ తీసుకొని పొన్నాలను అరెస్టు చేయించాలని కేసీఆర్ కోరారు. చిత్తశుద్ధి ఉంటే పొన్నాల వెంటనే టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరాయి పాలకుల కిరాయి మనిషిగా మారిన పొన్నాల లక్ష్మయ్యకు నేడో, రేపో జైలు తప్పదన్నారు.  
 
 పొరపాటు చేస్తే రిపేర్ చేయలేం
 
 ‘ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి.. ఈసారి పొరపాటు చేస్తే మళ్లీ రిపేర్ చేయలేం. ఇది తెలంగాణ తన తలరాత తానే రాసుకునే సమయం’ అని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ అనుకున్న తెలంగాణ రాలేదన్నారు. నీళ్లు, ఉద్యోగులు, ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని, లడాయి చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఢిల్లీలో మన ఎంపీలే ఉండాలని, అట్లయితేనే జేజమ్మయినా దిగొస్తదని చెప్పారు. అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తేనే అందరి బతుకులు బాగుపడతాయన్నారు. ఈ బహిరంగ సభల్లో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement