బిడ్డలా ఆదరించండి | KCR meets narendra modi, seeks special status for Telangana | Sakshi
Sakshi News home page

బిడ్డలా ఆదరించండి

Published Sun, Jun 8 2014 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బిడ్డలా ఆదరించండి - Sakshi

బిడ్డలా ఆదరించండి

మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి
ప్రధానితో అరగంటకు పైగా భేటీ
పునర్నిర్మాణానికి బాటలు వేయండి
కొత్త రాష్ట్రానికి కేంద్ర సాయమే కీలకం
ప్రత్యేక హోదా, ప్రాణహితకు జాతీయ హోదా
విభజన బిల్లు వాగ్దానాలన్నీ అమలు చేయండి
14 అంశాలతో మోడీకి సీఎం వినతిపత్రం
వాటిలో పోలవరం ప్రస్తావన లేని వైనం
నేడు కేసీఆర్ స్పష్టత ఇస్తారు: ఎంపీలు
రాష్ట్రపతితో భేటీ, హైదరాబాద్‌కు ఆహ్వానం
 
 సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పునర్నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ పాలకుల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను కేంద్రం ఇకనైనా చంటిబిడ్డలా ఆదరించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఉదారంగా నిధులు కేటాయించాలని విన్నవించారు. ‘‘వెనకబడిన తెలంగాణ జిల్లాలను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణపై ప్రకటన చేసే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. పలు సంస్థలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. అవన్నీ తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకోండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించినట్టుగానే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ప్రకటించాలి’’ అని విన్నవించారు. తెలంగాణలోని ఎనిమిది వెనకబడిన జిల్లాలు ఇప్పటికీ బీఆర్‌జీఎఫ్ గ్రాంట్ పొందుతున్నాయని ప్రధానికి గుర్తు చేశారు. తెలంగాణకు ఆయువు పట్టయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కూడా విన్నవించారు.
 
 తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఢిల్లీ వచ్చిన కేసీఆర్, శనివారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధానితో ఆయన అధికార నివాసం 7, రేస్‌కోర్స్ రోడ్‌లో అరంగటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రాభివధ్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయ సహకారాలపై ఆయనకు వివరించారు. ఈ విషయమై ప్రాధాన్యతా క్రమంలో కేంద్రం తీసుకోవాల్సిన పలు చర్యలను వివరిస్తూ 14 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మోడీకి కేసీఆర్ సమర్పించారు. అనంతరం మోడీతో కేసీఆర్ విడిగా 15 నిమిషాలు సమావేశమయ్యారు. అయితే, ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో కీలకమైన పోలవరం ఆర్డినెన్స్ అంశం ప్రస్తావన లేదు. దీనిపై టీఆర్‌ఎస్ ఎంపీలను మీడియా ప్రశ్నించగా, అన్ని ప్రశ్నలకూ కేసీఆర్ ఆదివారం ఉదయం బదులిస్తారని చెప్పారు. మోడీని కలసిన టీఆర్‌ఎస్ బృందంలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు కడియం శ్రీహరి, బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, బీబీ పాటిల్, బూర నర్సయ్యగౌడ్, గోడం నగేశ్, మాజీ ఎంపీ మందా జగన్నాథం ఉన్నారు.
 
 మళ్లీ ప్రశంసించిన ప్రణబ్
 
 ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలసి 15 నిమిషాల పాటు సమావేశమైంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు కేసీఆర్‌కు ప్రణబ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అనేక ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. గతంలో చెన్నారెడ్డి, వెంకటస్వామి వంటి వారు ప్రత్యేకోద్యమాలు చేసినా సాధించుకోలేకపోయారు. మీరు మాత్రం మీ జీవితకాలంలోనే లక్ష్యాన్ని సాధించారు’’ అంటూ ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఆయన ప్రశంసించారని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. 164 దేశాలతో త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు రాష్ట్రపతిని ఆహ్వానించేందుకు మరోమారు వస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రణబ్‌కు చెప్పారని వివరించారు. ‘హైదరాబాద్‌లో నాకూ ఇల్లుంది. మీ ఆహ్వానం మేరకు తప్పక వస్తా’ అని రాష్ట్రపతి చెప్పారన్నారు.
 
 రాజ్‌నాథ్‌తో భేటీ వాయిదా
 
 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో శనివారం జరగాల్సిన కేసీఆర్ సమావేశం చివరి నిమిషంలో రద్దయినట్టు సమాచారం. వారితో అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు టీఆర్‌ఎస్ నేతలకు శుక్రవారం తొలుత సమాచారం అందినా, దాన్ని వాయిదా వేస్తూ అదే రాత్రి వర్తమానం వచ్చినట్టు తెలిసింది.    
 
 విన్నపాలు వినవలె...
 
 1.    ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నట్లే తెలంగాణకూ ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి.
 2.    ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. దీనివల్ల తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
 3.    తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి వీలుగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ఇస్తున్న మాదిరిగా ప్రత్యేక పన్ను రాయితీలివ్వాలి.
 4.    కేంద్రం హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌తో పాటు కోల్ లింకేజీని ఏర్పాటు చేయాలి.
 5.    రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలి.
 6.    హైదరాబాద్‌ను మురికివాడల రహితంగా, అంతర్జాతీయ నగరంగా అభివృద్ధిపరిచేందుకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు రాష్ట్రం నుంచి సమాచారం తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలి.


 7. గుజరాత్‌లో సబర్మతీ నది పరిరక్షణకు నేషనల్ రివర్ కన్జర్వేషన్ డెరైక్టరేట్ ఆధ్వర్యంలో నిధులు కేటాయించిన రీతిలో మూసీ నది పరిరక్షణకు రూ.923 కోట్లు కేటాయించాలి.


 8, 9. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలో ఉద్యానవన, గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. అవసరమైన భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుంది.
 10.    వెనకబడిన ప్రాంతాలను ప్రధాన రహదారులతో కలిపేందుకు వీలుగా రూ.15 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి.
 11.    రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు పలు రహదారులను జాతీయ రహదారులుగా నవీకరించాలి.
 12.    కేంద్రం హామీ మేరకు బయ్యారంలో సెయిల్ ఆధ్వర్యంలో వెంటనే ఉక్కు కార్మాగారం నెలకొల్పాలి.
 13.    రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ, ఖాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటుతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర రైల్వే లైను ప్రాజెక్టులను పూర్తి చేయాలి.


 14.    తెలంగాణలో అటవీ భూముల రక్షణకు ఉద్దేశించిన కంపా నిధుల్లో తెలంగాణకు  రూ.1,104 కోట్ల వాటా ఉంది. వాటిలో కనీసం 30% నిధులను తెలంగాణలోని అటవీ సంరక్షణకు తక్షణం ఇవ్వాలి.
 
 రాజకీయ వైరం ఎన్నికల వరకే


 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపూరితంగా కాకుండా పరస్పరం సహకార ధోరణితో వెళ్లడం ద్వారా కొత్త రాష్ట్రానికి భారీగా కేంద్ర సాయాన్ని రాబట్టాలని టీఆర్‌ఎస్ అధినేత స్థూలంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా వీచిన మోడీ గాలిని తట్టుకుని విజయభేరి మోగించిన కేసీఆర్, బీజేపీతో వైరం ఎన్నికలకే పరిమితమని, ప్రస్తుతం కేంద్రంతో సహకార ధోరణితో వ్యవహరించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం ప్రధాని మోడీతో 15 నిమిషాల పాటు జరిపిన ఏకాంత భేటీలో కూడా కేసీఆర్ అదే రీతిలో మాట్లాడినట్టు తెలియవస్తోంది. ‘‘మీతో మాకెన్నడూ వైరం లేదు. బీజేపీ, టీడీపీ తెలంగాణలో కూటమిగా ఏర్పడ్డాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మేం ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. పైగా మా రాజకీయ వైరం ఎన్నికల వరకే. మీకు, మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మీరు చేయూతనివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తెలంగాణ వెలుగొందాలి’’ అని మోడీకి ఆయన విన్నవించినట్టు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ‘‘దశాబ్దాల ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్నీ సమకూర్చుతోంది. తెలంగాణకు మాత్రం పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఎలాంటి అదనపు రక్షణలూ లేవు. కొత్త రాష్ట్రంగా తెలంగాణకు కూడా మీ అండ కావాలి’’ అని కోరినట్టు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement