'కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశం లేదు'
హైదరాబాద్:కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు మాత్రమే ఏర్పడతాయని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించిన అనంతరం..బీజేపీపై కేసీఆర్ విమర్శలను ముమ్మరం చేశారు. తెలంగాణ శత్రువు మోడీ అని ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. బీజేపీతో తాము చేతులు కలిపే ప్రసక్తే లేదన్నారు. అసలు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. వాటికి వ్యతిరేకంగా ఏర్పడే మూడో ఫ్రంట్ కే తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య రాసిచ్చిన స్క్రిప్ట్‌నే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చదివారని కేసీఆర్ నిన్నటి సభల్లో విమర్శించారు. మోడీని తెలంగాణ శత్రువుగా ప్రకటిస్తున్నామన్నారు. ఆయన తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్న కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నాయన్నారు.