ప్రతి క్షణమూ దేశ సేవకే..
కోటి ఆశలతో ముందుకు సాగుదాం: నరేంద్రమోడీ
నాపై గురుతర బాధ్యత ఉంచారు..
ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తాను
వారు తలొంచుకునే పరిస్థితి రానివ్వను ..
అరగంట పాటు భావోద్వేగభరిత ప్రసంగం..
అద్వానీ మాటలతో మోడీ ఉద్వేగం..
కన్నతల్లిపై దయ చూపేవాడినా అంటూ కంటతడి
ఎక్కడైనా తల్లికి సేవ చేయడం దయ చూపించడం అవుతుందా? ఎన్నటికీ కాజాలదు. భారతమాత ఎలాగైతే నా మాతృమూర్తో అలాగే బీజేపీ కూడా నాకు తల్లే. తల్లిపై కుమారుడు దయ చూపించజాలడు. అంకితభావంతో సేవ మాత్రమే చేయగలడు.
(పార్టీపై మోడీ దయ చూపారన్న అద్వానీ వ్యాఖ్యలపై మోడీ భావోద్వేగం)
ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ప్రతి ఒక్కరి అభివృద్ధిలోనూ తోడుంటాం అన్నదే మా ప్రభుత్వ నినాదం
స్వాతంత్య్ర పోరాటం చేసే అదృష్టం మనకు దక్కలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశమూ లభించలేదు. కానీ దేశం కోసం బతికే సదవకాశం మనందరికీ కలిగిందిప్పుడు
న్యూఢిల్లీ: ‘‘నేను జన్మతః ఆశావాదిని. అణువణువునా ఆశావాదం నిండిన వ్యక్తిని. అది నా డీఎన్‌ఏలోనే ఉంది. నిరాశావాదమంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కేవలం ఒక ఆశావాది మాత్రమే ఇతరుల్లో స్ఫూర్తి, ఉత్సాహం నింపగలడు. నిరాశావాదానికి మనలో తావే ఉండకూడదు. ఎందుకంటే దానితో ఏమీ సాధించలేం. కొత్త ఆశలతో, సరికొత్త బలంతో ముందుకు సాగాల్సిన తరుణమిది’’ - దేశ 14వ ప్రధాని కాబోతున్న సందర్భంగా నరేంద్రమోడీ నోటి నుంచి జాలువారిన స్ఫూర్తిదాయకమైన మాటలివి. లోక్‌సభ ఎన్నికల్లో కమలనాథులకు ఒంటి చేత్తో అఖండ విజయం సాధించి పెట్టిన 63 ఏళ్ల మోడీ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి, ‘‘నాపై మీరుంచిన ఈ గురుతర బాధ్యతను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మనకు నిరాశ వద్దే వద్దు. గతకాలపు చేదు అనుభవాలను అధిగమించి ముందుకు సాగుదాం. అపార ప్రతిభకు మన దేశం ఆలవాలం. దేశ పౌరులమంతా కలసికట్టుగా ఒక్క అడుగు ముందుకు వేస్తే, మన దేశం ఏకంగా 125 కోట్ల అడుగులు ముందుకు వేసినట్టు’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘నా ప్రభుత్వ పనితీరును చూసి తలొంచుకోవాల్సిన పరిస్థితి మీకు ఎన్నటికీ రాదు గాక రాదు’’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. తాజా లోక్‌సభ ఎన్నికలను సామాన్యుడిలో మొలకెత్తిన కొత్త ఆశలకు ప్రతీకగా మోడీ అభివర్ణించారు. ఈ ఎన్నికల ఫలితాలిచ్చిన అతి ప్రధాన సందేశం ఇదేనన్నారు. ‘‘ఆశావాదం, బాధ్యతలతో కూడిన కొత్త శకానికి నాందీ పస్తావన జరిగింది. సామాన్యులు, అణగారిన వర్గాలు, ఏ అభివృద్ధికీ నోచుకోని అభాగ్యుల అభ్యున్నతికి నా ప్రభుత్వం త్రికరణ శుద్ధితో అంకితమవుతుంది’’ అని ప్రకటించారు. ‘‘ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ప్రతి ఒక్కరి అభివృద్ధిలోనూ తోడుంటాం’’ అన్నదే తన ప్రభుత్వ నినాదమని పేర్కొన్నారు. మోడీని తమ నేతగా ఎన్నుకునేందుకు మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ఆద్యంతం ఆనందోత్సాహాలతో సాగింది. పలు భావోద్వేగాలకూ వేదికై అలరించింది. స్వయంగా మోడీ కూడా తన ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ‘పార్టీపై మోడీ దయ చూపారు’ అన్న బీజేపీ భీష్ముడు అద్వానీ మాటలను గుర్తు చేసుకుంటూ కంటతడి కూడా పెట్టారు. కంఠం రుద్ధమై ఒక దశలో ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు. అనంతరం మంచినీళ్లు తాగి సేదదీరారు. బీజేపీ నూతన ఎంపీలను, రాజ్యసభ సభ్యులను, సీనియర్ నేతలను, ఎన్డీఏ మిత్రపక్షాలను ఉద్దేశించి అరగంట పాటు అనర్గళంగా ప్రసంగించారు. స్ఫూర్తిదాయకమైన మాటలతో వారిని ఆద్యంతం ఉర్రూతలూగించారు.
దేశం కోసం పాటుపడదాం
పదవులు, స్వపయోజనాల కోసం కాకుండా దేశ ప్రజల కోసం చిత్తశుద్ధితో పాటుపడాల్సిందిగా బీజేపీ ఎంపీలకు మోడీ పిలుపునిచ్చారు. ‘‘మనమంతా ఇప్పుడు ప్రజాస్వామిక కోవెలలో ఉన్నాం. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేద్దాం’’ అన్నారు. తన అతి సాధారణ నేపథ్యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తనవంటి అతి సామాన్యుడు ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిలబడ్డాడన్నా, పధాని వంటి అత్యున్నత పీఠాన్ని అందుకుంటున్నాడన్నా అది కేవలం భారత ప్రజాస్వామ్యం, మన జాతి నిర్మాత గొప్పదనమేనంటూ ప్రస్తుతించారు. ‘‘అసంఖ్యాకులైన పేదలకు, అణగారిన వర్గాల వారికి, అభాగ్యులకు, కోటానుకోట్ల మంది యువతకు, గ్రామీణులకు, మన తల్లులు, సోదరీమణుల భద్రతకు కొత్త ప్రభుత్వం తనను తాను అంకితం చేసుకుంటోంది. ఇకపై అనుక్షణం వారి సంక్షేమం కోసమే చిత్తశుద్ధితో పాటుపడుతుంది’’ అని ప్రకటించారు. ‘‘ప్రజా తీర్పు హంగ్ దిశగానో, విభజితంగానో ఉంటే వారు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వెలిగక్కారని, ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వెలువరించారని అనుకునే ఆస్కారముండేది. కానీ బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా వారు ఆశకు, నమ్మకానికి ఓటేశారు. మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మాపై వారికెన్నో అంచనాలున్నాయి. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు, నాపై ఉంచిన బాధ్యతను సజావుగా నిర్వర్తించేందుకు నా సర్వస్వం ధారపోస్తాను. శాయశక్తులా పాటుపడతాను. ఈ ప్రభుత్వం నా కోసం కాదు. దేశం కోసం. పేదల కోసం. వారి అభ్యున్నతికి ఎంతో చేయాలన్న తపన మాలో నిండుగా ఉంది’’ అని బీజేపీ నేతలు అడుగడుగునా చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రకటించారు.
ప్రగతి నివేదికతో ప్రజల ముందుకు
ఐదేళ్లు గడిచాక తన ప్రభుత్వ పనితీరుతో 2019లో ప్రజల ముందుకు, పార్టీ ముందుకు, ఎంపీల ముందుకు వస్తానని మోడీ ప్రకటించారు. మే 10న ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడగానే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ వద్దకు వెళ్లి తన పనితీరుపై నివేదిక సమర్పించానని చెప్పుకొచ్చారు. అలాగే తన ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యాక ప్రజలకు కూడా అలాంటి ప్రోగెస్ కార్డును సమర్పిస్తానన్నారు. గత ప్రభుత్వాల పనితీరును కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతించారు. ‘‘గత ప్రభుత్వాలు ఏమి చేయలేదనే ఆలోచన నేనెప్పుడూ చేయను. దేశ ప్రగతిలో మనకు ఇప్పటిదాకా సారథ్యం వహించిన ప్రభుత్వాలన్నింటి పాత్రా ఉంది. వాటి సారథులంతా దేశ సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. వారు చేసిన మంచి పనులన్నింటినీ మేం ముందుకు తీసుకెళ్తాం’’ అన్నారు. మోడీ ఇంకా ఏమన్నారంటే...
- పదవులను నేనెప్పుడూ పెద్ద గౌరవంగా భావించలేదు. కార్యభారం, బాధ్యతలనేవి అన్నింటికన్నా పెద్ద విషయాలు. వాటిని నెరవేర్చేందుకు మనం సిద్ధంగా ఉండాలి. సమర్పితమవ్వాలి
- గత సెప్టెంబరు 13న పార్లమెంటరీ బోర్డు నాకు బాధ్యతలిచ్చింది. అప్పుడు మొదలు పెట్టిన యజ్ఞం మే 10న పూర్తయింది. పూర్తి రిపోర్టును రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశాను
- 125 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, దృష్టి ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ప్రజాస్వామ్య బలం, రాజ్యాంగ సామర్థ్యం చూడండి. ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇవాళ ఇక్కడ నిల్చున్నాడు
- ఎన్నికల ప్రచారంలో భారతదేశపు కొత్త రూపాన్ని చూశాను. బీజేపీ ర్యాలీల్లో కొత్త సామర్థ్యాన్ని చూశాను. వారి ఒంటిపై ఉన్నది ఒక్క వస్త్రమే అయినా.. చేతిలో బీజేపీ జెండా ఉంది. ఆశలు, ఆపేక్షలతో మన వద్దకు వచ్చారు. వారంతా అత్యంత పేదలు. వారే మనలను ఇక్కడకు పంపారు. వారి కలలను నిజం చేయాలి. పేదల గురించి ఆలోచించేది, వినేది, పేదల కోసం బతికేదే ప్రభుత్వం.
- ప్రజలకు వీలైనంత మంచి చేయడానికి ప్రయత్నిద్దాం. సామాన్యుల ఆశలు, ఆకాంక్షల మేరకు వారికేమైనా చేద్దాం. దేశానికి ఏమైనా ఇచ్చి వెళ్దాం. అప్పుడే దేశ ప్రజలు నిరాశ చెందకుండా ఉంటారు
- 2013లో ఢిల్లీలోని తోల్కతొరాలో జరిగిన కౌన్సిల్ భేటీలో నేను ఒక మాట చెప్పా... ‘హం చలే య నా చలే, దేశ్ చల్ పడా (మనం నడిచినా, నడవకపోయినా దేశం మాత్రం ముందడుగు మొదలు పెట్టింది). ఇవాళ సెంట్రల్ హాలంతా బీజేపీ సైనికులతో నిండి ఉందంటే కారణం... దేశం కదలడమే!
- స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే, జైలుకు వెళ్లే అవకాశం రాకపోయినప్పటికీ ఇప్పుడు దేశం కోసం జీవించే అవసరం వచ్చింది. ప్రతీక్షణం, దేహంలోని ప్రతీకణం దేశ ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఆలోచిస్తూ ముందుకు వెళితే దేశం ముందుకు నడుస్తుంది.
- సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విశ్వం ముందు భారత్ తలెత్తుకునేలా చేశాయి.
- మీకు కనిపించే మోడీ పెద్దవాడేమీ కాదు. సీనియర్ నేతలు భుజాన ఎత్తుకోవడం వల్లే ఎత్తులో కనిపిస్తున్నాడు. ఈ రోజు మనకు దక్కింది ఐదు తరాల ప్రజలు, లక్షలాది మంది కార్యకర్తల తపస్సు ఫలితం. వారి వల్లే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం.
మోడీ మూగవోయిన వేళ...
మోడీ తన ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి భావోద్వేగానికి లోను కావడం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొన్న వారందరినీ కదిలించింది. మోడీ కంటే ముందు మాట్లాడిన అద్వానీ తన ప్రసంగం సందర్భంగా ‘బీజేపీ అప్పగించిన బాధ్యతలను స్వీకరించడం ద్వారా పార్టీపై నరేంద భాయి మోడీ దయ చూపారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన ప్రసంగంలో వాటిన ప్రస్తావించిన మోడీ, ‘అద్వానీ జీ ఒక మాటన్నారు’ అంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ‘మరోసారి ఆ పదం ఉపయోగించవద్దంటూ నేను అద్వానీ జీని ప్రార్థిస్తున్నాను’ అంటూ కంటతడి పెట్టారు. భావోద్వేగంతో గొంతు పూడుకుపోగా కాసేపు మాట్లాడలేకపోయారు. డయాస్‌ను పట్టుకుని, తల వంచుకుని మౌనంగా ఉండిపోయారు. మంచినీళ్లు కావాలంటూ సంజ్ఞ చేశారు. మంచినీళ్లు తాగిన అనంతరం తేరుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ఎక్కడైనా తల్లికి సేవ చేయడం దయ చూపించడమవుతుందా? ఎన్నటికీ కాజాలదు. భారతమాత ఎలాగైతే నా మాతృమూర్తో అలాగే బీజేపీ కూడా నాకు తల్లే. తల్లిపై కుమారుడు ఎన్నటికీ దయ చూపించజాలడు. కేవలం చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా, అంకితభావంతో సేవ మాత్రమే చేయగలడు. నిజానికి పార్టీయే నాపై దయ చూపింది. సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించింది’’ అంటూ రుద్ధమైన గొంతుతోనే మాట్లాడారు. భావోద్వేగభరితుడై మరికాసేపు మౌనంగా ఉండిపోయారు. ‘‘నన్ను ప్రధాని అభ్యర్థిని చేయడం ద్వారా బీజేపీ నాకు కట్టబెట్టిన గురుతర బాధ్యతను నెరవేర్చేందుకు నా ఒంట్లోని ప్రతి కణాన్నీ, నాకు అందుబాటులో ఉన్న సమయంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేసి మరీ పాటుపడ్డాను’’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా దేశవ్యాప్తంగా తాను చేసిన సుడిగాలి పర్యటనలను గుర్తు చేసుకుంటూ చెప్పారు.
వాజ్‌పేయి జీ వస్తే బాగుండేది
అస్వస్థతతో మంచానికి పరిమితమైన కారణంగా కార్యకమానికి రాలేకపోయిన మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయిని మోడీ ఈ సందర్భంగా వినమ్రంగా గుర్తు చేసుకున్నారు. ‘అటల్‌జీ ఆరోగ్యంగా ఉండి ఉంటే తప్పక వచ్చి ఉండేవారు. అప్పుడు ఈ కార్యకమానికి మరింత వన్నె చేకూరేది’ అని అన్నారు. అయినప్పటికీ వాజపేయి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఉంటాయని అన్నారు.
ఇదే తొలిసారి
పార్లమెంటు సెంటల్ హాల్లో అడుగుపెట్టడం మోడీకి ఇదే తొలిసారి కావడం విశేషం! ఈ అంశాన్ని కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘2001లో గుజరాత్ అసెంబ్లీని కూడా రాష్ట్ర ముఖ్యమంతి హోదాలోనే నేను తొలిసారిగా సందర్శించాను. ముఖ్యమంతి కార్యాలయంలో కూడా సీఎం హోదాలోనే తొలిసారి అడుగు పెట్టాను’’ అని గుర్తు చేసుకున్నారు.
పార్లమెంటులో ఘనస్వాగతం
తొలిసారిగా పార్లమెంటుకు వచ్చిన మోడీకి సెంట్రల్ హాల్లో ఘన స్వాగతం లభించింది. ఆయన మంగళవారం ఉదయం 11.45 గంటలకు గుజరాత్ భవన్ నుంచి బయల్దేరి 12 గంటల సమయంలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద స్కార్పియో వాహనం దిగారు. నాలుగో నంబరు గేటు వద్ద మెట్లకు నుదురు తాకించి మరీ అభివందనం చేసి సెంట్రల్‌హాల్లో అడుగు పెట్టారు. ప్రధాన ద్వారం వద్ద జైట్లీ, అమిత్ షా స్వాగతం పలికారు. సెంట్రల్ హాల్‌లో అద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు.
విశేషాలివీ..
బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి మోడీ ఎప్పట్లాగే తన ట్రేడ్ మార్కు కుర్తా-పైజామా, వెస్ట్ కోటుతో వచ్చారు
అగ్రనేత అద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు. ఆయన మోడీని లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకున్నారు
ఈ సందర్భంగా భావోద్వేగాన్ని ఆపుకోలేక ఎల్‌కే అద్వానీ కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇంతటి చరిత్రాత్మక క్షణం కేవలం మోడీ వల్లే వచ్చిందన్నారు
మోడీ సన్నిహితుడు అమిత్ షాను బీజేపీ నేతలంతా అభినందనలతో ముంచెత్తడం కన్పించింది
లోక్‌సభకు ఎంపికైన రాజస్థాన్ సీఎం వసుంధర రాజె కుమారుడు దుష్యంత్‌సింగ్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు అభిషేక్ ప్రధానాకర్షణగా నిలిచారు. సీఎంలిద్దరూ తమ కుమారులను దగ్గరుండి ఇతర ఎంపీలకు పరిచయం చేస్తుండటం కన్పించింది.
మథుర లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన డ్రీమ్‌గాళ్ హేమమాలిని కూడా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. బంగారు పువ్వుల డిజైన్‌తో కూడిన క్రీమ్ కలర్ చీరలో మెరిసిపోయారు.