
రాహుల్ సభకు గ్రౌండ్లే లేవు
'రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఎవరైనా జాన్తానై! వాళ్లకు మా గ్రౌండ్ ఇచ్చేది లేదు' అంటూ సైన్యం ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాహుల్ గాంధీ ఎన్నికల సభ నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలు బోల్తా పడ్డాయి.
విద్యాసంస్థల్లో ఎన్నికల సభలు నిర్వహించకూడదన్న ఎన్నికల సంఘం నిబంధన పుణ్యమా అని నిజాం కాలేజీ గ్రౌండ్స్ కూడా దక్కే పరిస్థితులు లేవు. ఒక్క లాల్ బహదూర్ స్టేడియం తప్ప మరెక్కడా సభ నిర్వహించుకోవడం కుదరదు. దీంతో అన్ని ప్రధాన పార్టీలకూ హైదరాబాద్ లో సభలు నిర్వహించడం కష్టమైపోతోంది.
దీంతో ఇప్పుడు హైదరాబాద్ లో సభ నిర్వహించడం కన్నా రోడ్ షో పెట్టుకోవడమే మేలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఎన్నికలు ఏప్రిల్ 30 న జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు కంగారులో ఉంది. 'అసలు రాహుల్ గాంధీ వస్తారా లేదా అన్నదే ఇప్పుడు మా సందేహం' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అంటున్నారు.
ఒక్క కాంగ్రెసే కాదు అరవింద్ కేజరీవాల్, మేధా పాట్కర్ లతో సభ నిర్వహించాలన్న ఆప్ ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయినట్టే. దీంతో హైదరాబాద్ లో ఏ ప్రధాన రాజకీయ పార్టీ సభను పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఆర్మీ పరేడ్ గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్ ను స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డేలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.