PM Narendra Modi's Speech at Parade Grounds Public Meeting - Sakshi
Sakshi News home page

నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి: ప్రధాని మోదీ

Published Sat, Apr 8 2023 1:29 PM | Last Updated on Sat, Apr 8 2023 1:51 PM

PM Narendra Modi Speech In Parade Grounds Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. అనంతరం, పరేడ్‌ గ్రౌండ్స్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.. రిమోట్‌ ద్వారా శంకుస్థాపనలు చేశారు. ఐదు జాతీయ రహదారులకు, బీబీనగర్‌ ఎయిమ్స్‌ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే, మహబూబ్‌ నగర్‌ డబ్లింగ్‌ పనులను మోదీ ప్రారంభించారు. రూ.11,355 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక, జెండా ఊపి.. ఎంఎంటీఎస్‌ రైళ్లను ప్రారంభించారు. 

అనంతరం, బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర సోదరీమణులరా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు.

మేం అభివృద్ధి చేస్తుంటే సొంత పనుల కోసం, కుటుంబ లాభం కోసం కొంత మంది ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడంలేదు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవినీతి, కుటుంబ పాలన రెండూ ఒక్కటే. తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగింది. ప్రతీ వ్యవస్థలో పెత్తనం చలాయించాలని వారి ప్రయత్నం జరుగుతోంది.

కొందురు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు. అవినీతపరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. అవినీతిని ముక్తకంఠంతో ఖండించాలి. ఎంతపెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దు. విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు. కొంత మంది అవినీతిపరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు వాళ్లకు షాక్‌ ఇచ్చింది. కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి. తెలంగాణలో ప్రజావ్యతిరేకత మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇక, అంతుకుముందు.. తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రతీఒక్కరూ భాగస్వాములయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి తిరుమల వెంకన్న వరకు ట్రైన్‌ వేశామన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా చేయాలన్నది కేంద్రానికి తెలుసు. రూ.11వేల కోట్లకుపైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఏపీ-తెలంగాణను కలుపుతూ మరో వందేభారత్‌ రైలును ప్రారంభించాం.

సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ నినాదంతో మందుకెళ్తున్నాం. హైదరాబాద్‌లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెట్రో, ఎంఎంటీఎస్‌ విస్తరించాం. ఎంఎంటీఎస్‌ విస్తరణ కోసం రూ.600 కోట్లు కేటాయించాం. తెలంగాణను అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది. రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాం. తెలంగాణలోనూ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం. తెలంగాణలో 4 హైవేలైన్లకు శంకుస్థాపన చేశాం. రాష్ట్రంలో 5వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. 

తొమ్మిదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో​ ముందంజలో ఉన్నాం. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్‌లో స్థిరంగా అభివృద్ధి జరుగుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం.  ఇదే సమయంలో గత ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులు, రైతులు, చిరు వ్యాపారులకు నేరుగా నగదు జమ కోసం డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థను ప్రోత్సహించాం. గతంలో ఇది ఎందుకు నిర్వహించలేదు? అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement